TPCC Mahesh Goud: పవన్ కళ్యాణ్‌పై మహేశ్‌ గౌడ్ కీలక వ్యాఖ్యలు

  • పవన్ కళ్యాణ్ బీజేపీ స్క్రిప్ట్‌నే చదువుతున్నారు: మహేష్ గౌడ్
  • తెలంగాణ ఉద్యమంలో పవన్ ఎక్కడున్నారు? టీపీసీసీ చీఫ్ ప్రశ్న
  • ఏపీపై దృష్టి పెట్టండి.. కాంగ్రెస్‌పై మాట్లాడే అర్హత లేదు
  • బీజేపీ-బీఆర్ఎస్-పవన్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందా?
Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంపై, కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పదే పదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మండిపడ్డారు.

రాజకీయాల్లో విచ్చలవిడిగా మాట్లాడటానికి ఇదేమీ సినిమా కాదని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. “పవన్ కళ్యాణ్ స్వతహాగా మాట్లాడుతుండలేదు.. కేంద్రంలోని మోడీ, ఇతర బీజేపీ నేతలు కించపరిచేలా స్క్రిప్ట్ ఇస్తే, దాని ప్రకారం పవన్ మాట్లాడుతున్నారు. ఆయన పూర్తిగా బీజేపీ ఆడించే తోలుబొమ్మలా మారిపోయారు” అని దుయ్యబట్టారు. తెలంగాణ ఆవిర్భావాన్ని, రాష్ట్ర విభజనను పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ మాట్లాడటం కొత్తేమీ కాదని, గతంలోనూ మోడీతో సహా బీజేపీ నేతలు ఇదే తరహాలో తెలంగాణను అవమానించారని గుర్తుచేశారు.

×
×
Ad

తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు..? సినిమాల్లో డైలాగులు కాదు

ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేస్తే, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేశారని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. “తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఏ సినిమాలో నటిస్తున్నారు?” అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమంటే సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులువు కాదని.. నెహ్రూ, గాంధీ కుటుంబాల త్యాగాల చరిత్రను పవన్ శ్రద్ధగా చదువుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రధాని మోడీ ఇవాళ రాకెట్ల ముందు నిలబడి ఫోటోలు దిగుతున్నారంటే, ఆ అంతరిక్ష రంగానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలన్నారు.

ఏపీపై దృష్టి పెట్టండి.. రాజకీయాల్లో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది

పవన్ కళ్యాణ్ చాలా పెద్ద హీరో కావడానికి తెలంగాణ ప్రజలు కూడా కారణమని, ఇక్కడి ప్రేక్షకులు చూడబట్టే ఆయన సినిమాలు ఆడాయనే విషయాన్ని మరువరాదని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌కు అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. “పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు, ఆ విషయంలో ఆయన చాలా చిన్నవాడు. అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు.

బీఆర్ఎస్, పవన్ లోపాయికారీ ఒప్పందం?

రెండు రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని, కానీ తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని మహేష్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పాలన సాగుతోందని.. ఏపీ సైతం మన వైపు చూసేలా ఇక్కడ పరిపాలన ఉందన్నారు. అయితే, తెలంగాణను కించపరుస్తూ పవన్ కళ్యాణ్ ఇంతలా మాట్లాడుతున్నా.. బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. వీరి మౌనం వెనుక బీజేపీ, బీఆర్ఎస్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం స్పష్టంగా అర్థమవుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.