Site icon NTV Telugu

Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నలుగురు మహిళలకు కేబినెట్‌లో చోటిస్తాం

కొల్లాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు- మన పోరు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యి 8 ఏళ్లకు పైగా అవుతుందని.. అప్పటికీ, ఇప్పటికీ పాలమూరు మారిందా అని ప్రశ్నించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ మారి ఏం సాధించారని రేవంత్‌రెడ్డి నిలదీశారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చుతానని కేసీఆర్ చెప్పారని.. ఆ విషయం ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు.కేసీఆర్‌కు మాదిగల వర్గీకరణ చేసే ఉద్దేశ్యం లేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ జరగాలంటే పాలమూరులో 14 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అటు ముదిరాజ్‌లకు కూడా కేసీఆర్ న్యాయం చేయలేదని.. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక్క ముదిరాజ్‌ను బొందపెట్టారని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో భాగంగానే కేసీఆర్ ఉద్యోగాల నాటకానికి తెరతీశారని రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తున్నానని రేవంత్ తెలిపారు. నలుగురు మహిళలకు కేబినెట్‌లో చోటు కల్పిస్తామన్నారు. పాలమూరు జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు నీరు అందించే వరకు తాము నిద్రపోమన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, జూరాల, ఎస్ఎల్‌బీసీ పనులన్నీ పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.

Exit mobile version