హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం దగ్గర ఇద్దరు రియల్టర్ల హత్య కలకలం సృష్టిస్తోంది.. భూవివాదం పరిష్కారం కోసం మాట్లాడుకుందామని పిలిచి కాల్పులు జరపగా.. ఒక రియల్టర్ ఘటనా స్థలంలోనే.. మరో రియల్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.. అయితే, ఈ హత్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ కలిసే ధరణి పోర్టల్ తెచ్చారని గుర్తుచేసిన ఆయన.. ఆ పోర్టల్‌లో మొత్తం తప్పులే ఉన్నాయని.. వాటి కారణంగా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.. ఇక, నిన్ననే ఇబ్రహీంపట్నంలో ఇద్దరి రియల్టర్ల హత్య జరిగందని.. దానికి ప్రధాన కారణం ధరణి పోర్టల్‌లో లోపాలే అన్నారు.
హైదరాబాద్ చుట్టు పక్కల భూములు కాజేస్తున్నారన్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.. రెవెన్యూ అధికారులు పాత యజమానులకే పట్టాలిచ్చారని.. వేల కోట్ల భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. 20 ఏళ్ల క్రితం ఉన్న భూ యజమానులు పేర్లు ధరణిలో వస్తున్నాయని.. దీంతో భూమి కొన్న ఓనర్లు ఆగమై హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, రాష్ట్రంలో తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లకు అన్యాయం జరుగుతుందన్నారు రేవంత్‌రెడ్డి.. బీహార్ అధికారులను కేసీఆర్ కోటరిగా పెట్టుకున్నారన్న ఆయన.. నా మాటలకు అధికారుల నుండో.. టీఆర్ఎస్ నేతల నుండో విమర్శలు వస్తాయని అనుకున్నా… కానీ, బీహార్ మంత్రి… నాపై విమర్శలు చేస్తూ కేసీఆర్‌ని సమర్థించారంటూ దుయ్యబట్టారు.. దీంతో.. కేసీఆర్ ఏ స్థాయికి వెళ్లారు అనేది ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.