ప్రజా సమస్యలను గాలికొదిలేసి టీఆర్ఎస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు లోపాయకారీ అవగాహనతోనే భాగ్యనగరంలో చిల్లర పంచాయితీ పెట్టాయని ఆయన ఆరోపించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి కూడా బీజేపీ, తెరాస జెండాలు కట్టారని ఆయన అన్నారు. వాటిని వెంటనే తొలగించాలనన్నారు. ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా టీఆర్‌ఎస్ జెండాలు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారని రేవంత్ ప్రశ్నించారు.
కార్పొరేట్ కంపెనీల డబ్బులతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందన్నారు.ఎనిమిదేళ్లుగా తెలంగాణకు కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. అగ్నిపథ్ పథకంపై మోదీని కేసీఆర్ ప్రశ్నించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలుగా అటువైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదన్నారు. జీఎస్టీ ద్వారా జరిగిన అన్యాయంపై కేసీఆర్ ప్రశ్నించలేదని అన్నారు.
తెలంగాణ ఏర్పాటును చులకన చేసి మాట్లాడిన ప్రధానికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత కూడా లేదన్నారు. మోదీ ప్రభుత్వం దేశభద్రతను ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు.. మోదీని ప్రధానమంత్రిగా అంగీకరించరని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ చతురతతో వ్యవహరించాలన్న రేవంత్.. ప్లెక్సీల పంచాయితీ.. చిల్లర పంచాయితీ పక్కన పెట్టాలన్నారు. కేసీఆర్‌ను మొదట కలిస్తే.. యశ్వంత్ సిన్హానే కాదు.. బ్రహ్మ దేవుడినైనా కలిసేది లేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
