Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పాకిస్తాన్ విడిచి పారిపోతున్న ఆటో మొబైల్ కంపెనీలు.. ఇక సెకండ్ హ్యాండ్ వాహనాలే దిక్కు

ప్రపంచ దేశాల ముందు బిల్డప్పులు కొట్టే పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితిని చూసి వణికిపోయే పరిస్థితి దాపరించింది. విదేశీ అప్పుల భారం పెరిగింది, డాలర్ కొరత ఉంది. IMF షరతులు విధిస్తోంది. తత్ఫలితంగా, పాకిస్తాన్ ఆటోమోటివ్ పరిశ్రమ కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక పరిస్థితి, IMF ఒత్తిడితో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది. ఇది పాకిస్తాన్ ఆటో ఇండస్ట్రీని సవాళ్లతో కూడిన పరిస్థితిలోకి నెట్టింది. ఇటీవలే ఆర్థిక సమన్వయ కమిటీ (ECC) సెకండ్ హ్యాండ్ కార్ల దిగుమతికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం దీనిని సంస్కరణ, స్వేచ్ఛ వైపు కీలక అడుగుగా భావిస్తోంది. అయితే కార్ల తయారీదారులు, ఆటో విడిభాగాల తయారీదారులు ఈ నిర్ణయం తమ పునాదులను దెబ్బతీస్తుందని అంటున్నారు. పాకిస్తాన్ ఆటోమోటివ్ తయారీదారుల సంఘం (PAMA) దేశం తిరోగమన, దోపిడీ విధానాలు విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని క్షీణింపజేస్తున్నాయని, కొన్ని ప్రధాన కంపెనీలు మార్కెట్‌ను విడిచిపెట్టడానికి దారితీయవచ్చని హెచ్చరించింది.

మంత్రి నారా లోకేష్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్.. తమ్ముడు ఐ యామ్ వెయిటింగ్!

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపులో కీ రోల్ పోషించిన యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ ఏపీ విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఓ స్పెషల్ బహుమతిని అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో తాను ఉపయోగించిన క్యాప్‌ను తన అద్భుత ప్రదర్శనను అభినందించిన లోకేష్‌కు ప్రేమతో ఇవ్వనున్నట్లు తిలక్ ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా తెలియజేశాడు. అయితే, తిలక్ వర్మ ఇచ్చిన ఈ ప్రత్యేక గిఫ్ట్ పై నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, “తమ్ముడు తిలక్ బహుమతి నాకు ఎంతో ప్రత్యేకం. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత అతడి చేతుల మీదుగానే ఈ క్యాప్‌ తీసుకుంటాను అని వెల్లడించారు.

చాహల్ మోసం చేశాడు.. ధనశ్రీ షాకింగ్ కామెంట్స్

ఇండియన్ క్రికెటర్ చాహల్, ధన శ్రీ విడాకులు దేశ వ్యాప్తంగా రచ్చ లేపాయి. విడాకుల టైమ్ లో చాహల్ నుంచి ధన శ్రీ రూ.60 కోట్ల భరణం తీసుకుందనే వార్తలు తీవ్ర దుమారం రేపాయి. వాటిపై అప్పట్లో పెద్ద రచ్చనే జరిగింది. కానీ వాటిపై ఆమె సైలెంట్ గా ఉండటం వల్ల మరింత ట్రోల్స్ వచ్చాయి. ఆమె భరణం నిజమే అంటూ మీడియా సంస్థల్లోనూ వార్తలు వచ్చాయి. వాటిపై రీసెంట్ గానే ఆమె స్పందించింది. చాహల్ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపింది. రూ.60 కోట్లు కాదు కదా.. ఒక్క రూపాయి అడగలేదని.. ఇద్దరం ఇష్టపూర్వకంగా విడిపోయినప్పుడు భరణం ఎలా అడుగుతానని తెలిపింది ధనశ్రీ. ఇక తాజాగా మరోసారి ఆమె స్పందించింది. రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె.. చాహల్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. చాహల్ ను పెళ్లి చేసుకుని తప్పు చేశా. పెళ్లి అయిన ఏడాది తర్వాత రెండు నెలలకే అతన్ని పట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు అంటూ ఎమోషనల్ అయింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాహల్ నుంచి ధన శ్రీ విడిపోయిన టైమ్ లో ఆమె మీద వచ్చిన నెగెటివ్ ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం చాహల్ మళ్లీ క్రికెట్ లో ఫామ్ కోసం ట్రై చేస్తున్నాడు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రేపు నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ

వైసీపీ ముఖ్యనేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల ముందు వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కమిటీల నిర్మాణం, సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టి సారించాలి.. కమిటీల నిర్మాణం, మైక్రో లెవల్ ప్లానింగ్‌పై మనం పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టాలి అని సూచించారు. సెంట్రలైజ్డ్ డేటా ప్రొఫైలింగ్‌ కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతుంది అన్నారు. నిబద్దతతో, చురుగ్గా పని చేసే వారిని గుర్తించి కమిటీలలో ప్రాధాన్యతం ఇవ్వాలని సజ్జల సూచించారు.

ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో జైలు నుంచి ఎంపీ మిథున్‌ రెడ్డి విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. సుమారు 71 రోజుల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి ఇవాళ ( సెప్టెంబర్ 29న) ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కావడంతో.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తలు, మిథున్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక, ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వారంలో రెండుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని పేర్కొనింది.

మత్స్యకారులతో రాజకీయాలు చేయొద్దు..

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామస్తులు హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ పై రాజయ్యపేట ప్రజలను బయట వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టారు అని ఆరోపించింది. మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయవద్దు అని కోరింది. పోలీసులు ఎవ్వరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను.. 16 రోజులుగా రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ మీద ధర్నా జరుగుతోంది.. సమస్య పరిష్కారం కోసం రాజయ్య పేట రావాలని ప్రజలు కోరారు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఇక్కడకు వచ్చాను.. రాజయ్య పేట గ్రామం టీడీపీ కంచుకోట.. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీటీ ఇచ్చారు అని మంత్రి అనిత గుర్తు చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగింపు.. క్రాస్‌ ఎగ్జామినేషన్ కీలక దశ

తెలంగాణ రాజకీయాల్లో మరో ఉత్కంఠకర దశ నేడు చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ స్పీకర్‌ ముందే జరిగింది. ఈ సందర్భంగా నలుగురు ఎమ్మెల్యేలపై క్రాస్‌ ఎగ్జామినేషన్ జరగగా, అక్టోబర్ 1న ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్‌లను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అడ్వకేట్‌లు క్రాస్‌ ఎగ్జామిన్ చేయనున్నారు. విచారణ సమయంలో స్పీకర్‌ ముందు హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్. ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలే యాదయ్యపై వివిధ ఆసక్తికర ప్రశ్నలు వేసి సవాళ్లు విసురుకున్నారు. ముఖ్యంగా పార్టీ అనుమతి మేరకే ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారా, కాంగ్రెస్‌లో చేరిన తరువాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు లేదా వంటి ప్రశ్నలు చర్చకు రంగం కల్పించాయి. “పార్టీ అనుమతి మేరకే ఫిరాయింపులపై ఫిర్యాదు చేశాం. సుప్రీం కోర్ట్‌కు కూడా పార్టీ తరపునే వాదనలు సమర్పించాం.” అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

పేదల కోసం కీలక అడుగు..

హైదరాబాద్ నగరంలో పేదలు, అడ్డా కూలీలు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లకు భరోసా కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక న్యాయం, సంక్షేమం పట్ల కట్టుబాటుతో ప్రభుత్వం “ఇందిరమ్మ క్యాంటీన్‌లు” సంఖ్యను పెంచుతూ, కొత్త కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. మోతినగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్ ప్రాంతాల్లో ఏర్పాటైన కొత్త ఇందిరమ్మ క్యాంటీన్‌లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్లు బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, పంకజ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించింది. గిన్నిస్‌ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో సోమవారం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 63 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు. ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మన తెలంగాణ బతుకమ్మ రెండు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడారు.

బాలయ్య వివాదం.. ఫాన్స్ కి చిరు హెచ్చరిక?

కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. అసెంబ్లీలో ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్న సమయంలో బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావించకపోయినా, కొంచెం వ్యంగంగా మాట్లాడినట్లు స్ఫురించింది. వెంటనే మెగాస్టార్ చిరంజీవి, అసలు నిజా నిజాలు ఏమిటంటే అనే విషయం మీద ఒక ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ విషయం మీద సీరియస్ అయిన మెగా అభిమాన సంఘాలు, బాలకృష్ణతో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఒక హోటల్లో చిరంజీవి అభిమాన సంఘాల వారు సమావేశం అయ్యారు.

 

Exit mobile version