సోనమ్ వాంగ్‌చుక్ కేసులో పాకిస్తాన్ కోణం.. దర్యాప్తులో సంచలన విషయాలు..
బుధవారంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ ఆందోళనల్లో నలుగురు మరణించడంతో పాటు 50కి పైగా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడంతో పాటు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. అయితే, ఈ హింసను ప్రేరేపించేలా చేశాడని లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్ర ప్రభుత్వం కేసు పెట్టింది. సోనమ్ వాంగ్‌చుక్ ఎన్జీవోల విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించిందని, ఎఫ్‌సీఆర్ఏ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా ఆయన సంస్థల రిజస్ట్రేషన్లను కేంద్రం రద్దు చేసింది. గురువారం, అల్లర్లకు ప్రేరేపించిన కారణంగా అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సోనమ్ వాంగ్‌చుక్ దర్యాప్తులో పాకిస్తాన్ కోణం బయటపడింది.
18 రోజుల తర్వాత ప్రత్యేక్షమైన నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి..
నేపాల్ మాజీ ప్రధాన మంత్రి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (UML) ఛైర్మన్ కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. పార్టీ విద్యార్థి విభాగం, రాష్ట్రీయ యువ సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన శనివారం భక్తపూర్ చేరుకున్నారు. భారీ నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఓలి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. నిరసనల ప్రారంభంలో కేపీ ఓలిని నేపాల్ సైన్యం రక్షణలో ఉంచారు. తరువాత తాత్కాలిక నివాసానికి తరలించారు. తాజాగా పార్టీ సమావేశం అనంతరం కనిపించారు. యువతతో కనెక్ట్ అవ్వడానికి, రాజకీయ ప్రభావాన్ని కొనసాగించడానికి బయటికి వచ్చినట్లు చెబుతున్నారు.
చిరంజీవి చెప్పిందే నిజం.. ఆర్.నారాయణ మూర్తి రియాక్ట్
ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్లపై తాజాగా ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ నోట్ లో చెప్పింది వంద శాతం నిజం. మమ్మల్ని గత వైసీపీ ప్రభుత్వం అవమానించలేదు. జగన్ ను కలిసిన వారిలో నేను కూడా ఉన్నాను. ప్రెస్ నోట్ లో చిరంజీవి నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను స్పందిస్తున్నాను. చిరంజీవి స్వయంగా నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. అది చిరంజీవి సంస్కారం. సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి చిరంజీవి ఆధ్వర్యంలో మాట్లాడేందుకు మేం తాడేపల్లి వెళ్లాం. అక్కడ మాకు ఎంతో గౌరవం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం సినిమా వాళ్లను అవమానించలేదు. చిరంజీవిని వైసీపీ ప్రభుత్వం అవమానించిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అందులో నిజం లేదు.
1.63 కోట్ల మంది పేదలకు రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు అందించేలా పాలసీ..!
2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు పెట్టాం.. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మరింత అభివృద్ధి చేసింది.. కానీ ఏపీలో దౌర్బాగ్యం.. అన్న క్యాంటీన్లను రద్దు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటి వరకు అన్న క్యాంటీన్ల ద్వారా 5.72 కోట్ల భోజనాలు పెట్టాం.. రూ.104 కోట్ల మేర సబ్సిడీని అందించామని గుర్తు చేశారు.. ప్రతి దేవాలయంలో అన్నదానం కార్యక్రమం చేపడతామన్నారు. రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార పంపిణీ చేపడుతున్నాం… దీని కోసం రూ. 14,070 కోట్లు ఖర్చు పెడుతున్నామని గుర్తు చేశారు. రేషన్ మాఫియాను అరికడుతున్నాం.. రేషన్ డిపోలను పునః ప్రారంభించామన్నారు.
ఎవర్రా నువ్వు.. కన్న తల్లిదండ్రులను చంపానని టీవీ షోలో చెప్పిన కొడుకు !
అమెరికాలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఒక కొడుకు తన సొంత తల్లిదండ్రులను చంపినట్లు టీవీ షోలో వెల్లడించాడు. అమెరికాలో నిర్వహించిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం తన తల్లిదండ్రులను హత్య చేసి, వారి మృతదేహాలను తన ఇంటి వెనుక భాగంలో ఎలా పాతిపెట్టాడో వెల్లడించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిందితుడు స్టూడియో నుంచి బయటకు రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అల్బానీలోని నిందితుడి ఇంటి నుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గురువారం నిందితుడు లోరెంజ్ క్రాస్ తన తల్లిదండ్రులను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. క్రాస్ తల్లిదండ్రులు ఫ్రాంజ్- థెరిసియా క్రాస్‌లను చాలా ఏళ్లుగా కనిపించలేదని పోలీసు దర్యాప్తులో తేలింది. అమెరికాలోని ఒక స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోరెంజ్ క్రాస్ ఈ హత్యలు తాను చేశానని వివరించాడు. తన తల్లిదండ్రులను తాను చంపానని నేరుగా అంగీకరించడానికి క్రాస్ మొదట్లో సంకోచించాడు, కానీ యాంకర్ అతనిని అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత, అతను నిజం ఒప్పుకున్నాడు.
42 శాతం రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంది
తెలంగాణలో బలహీన వర్గాల (BC) కోసం 42% రిజర్వేషన్ల జారీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం ఆనందంగా ఉందని చెప్పారు. మంత్రులు చెప్పారు, “42% రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంది. గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లు ఆమోదం కాకుండా ప్రయత్నించగా కూడా మేము జీవోని జారీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం.” అలాగే, వచ్చే బడ్జెట్‌లో ఈ నిర్ణయానికి సంబంధించి అవసరమైన నిధులను కేటాయించి ఖర్చు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. “మా లక్ష్యం నెరవేరింది, బడుగు బలహీన వర్గాలకు ఇది దసరా కానుక” అని ఆయన స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరూ అడ్డుకోవద్దు, కోర్టులో సవాల్ చేయరాదు అని కూడా విజ్ఞప్తి చేశారు. ఆయనకు ప్రకారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితిని ఏర్పరిస్తుంది.
ఆ దేశాధ్యక్షుడి వీసా రద్దు చేసిన అగ్రరాజ్యం!
ఒకప్పుడు ఈ రెండు దేశాలు చారిత్రాత్మక మిత్రదేశాలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంతకీ ఈ రెండు దేశాలు ఏంటి, వాటి మధ్య మారిన పరిస్థితులు ఏంటి, ఏ దేశ అధ్యక్షుడికి అగ్రరాజ్యం వీసా రద్దు చేసిందనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసా.. ప్రపంచ దేశాల దృష్టిని ప్రస్తుతం అమెరికా, కొలంబియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఎందుకనుకుంటున్నారు.. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడు లేని విధంగా గణనీయంగా క్షీణించాయి. న్యూయార్క్‌లో అమెరికా దళాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వీసాను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది.
అరబ్ దేశాలకు యూఏఈ షాక్.. నెతన్యాహూతో మీటింగ్..
ఇజ్రాయిల్ గాజాపై దాడి చేయడాన్ని పలు ముస్లిం, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగ సమయంలో అరబ్ దేశాలు, ముస్లిం దేశాల ప్రతినిధులు సభను నుంచి వాకౌట్ చేశారు. కొన్ని దేశాలు మాత్రమే సభలో కూర్చుని నెతన్యాహూ ప్రసంగాన్ని విన్నాయి. ఇదిలా ఉంటే, అరబ్ దేశాలకు విరుద్ధంగా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) మాత్రం నెతన్యాహుతో సమావేశం అయింది. అబుదాబి మాత్రం ఇజ్రాయిల్‌తో సంబంధాలను పెంచుకోవాలని, నిరసన తెలుపకూడదని నిర్ణయించుకుంది. నెతన్యాహూతో క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించింది యూఏఈ. అరబ్ ప్రతినిధులతో కలిసి వాకౌట్ చేసేందుకు నిరాకరించింది. ప్రస్తుతం, యూఏఈ చర్యలు ప్రాంతీయ ఐక్యత కన్నా, రాజకీయ, వ్యూహాత్మక పొత్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని సూచిస్తున్నాయి.
అందుకే అఘోరీని పెళ్లి చేసుకున్న.. శ్రీ వర్షిణి సంచలన వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం గతంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరీ మరో సంచలనానికి తెరలేపింది. అయితే.. తాజాగా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ, వర్షిణి పెళ్లి చేసుకున్నారు. వర్షిణి మెడలో అఘోరి తాళికట్టగా.. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి.
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పీఓకేలో నిరసనలు.. పాక్ ఆర్మీ కాల్పులు..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తు్న్నారు. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వీరిని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ, పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పీఓకేలోని కోట్లీలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. మరణాల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం, పర్యాటకుల్ని పీఓకే వెళ్లవద్దని సూచించింది. జర్నలిస్టులు, మీడియా పీఓకేలోకి ప్రవేశించకుండా నిషేధించింది. పీఓకేలో 2000 మంది పోలీస్ సిబ్బంది, 167 ఎఫ్సీ ఫ్లాటూన్లను మోహరించినట్లు తెలుస్తోంది.
