Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

యూనస్ షేక్ హసీనాకు భయపడుతున్నారా..?

మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి ఏడాది అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్, స్టూడెంట్స్ లీగ్‌లను బంగ్లాలో నిషేధించారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ మనస్సులో షేక్ హసీనా భయం తొలగిపోయినట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ యూనస్ మరోసారి షేక్ హసీనా పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు అవామీ లీగ్ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.

ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్.. 12,000 మంది తొలగింపు..

భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతోంది. 2026 ఫైనాన్షియల్ ఇయర్‌లో తన మొత్తం వర్క్‌ఫోర్స్ నుంచి 2 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఇది ప్రధానంగా మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్‌ని ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది.

తెలంగాణ బీజేపీ చీఫ్ పై మంత్రి పొన్నం ఫైర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, “ఎరువులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయనే విషయం కూడా రామచంద్రరావుకి తెలియదా?” అంటూ మండిపడ్డారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో కూడా రామచంద్రరావుకి అర్థం కావడం లేదు. మిగతా విత్తనాలు, నీళ్లు, విద్యుత్ వంటి సదుపాయాలను రాష్ట్రాలు అందిస్తున్నాయి కానీ ఎరువుల తయారీ, సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది” అని స్పష్టం చేశారు.

పెళ్లికి నో చెప్పిందని, పాకిస్తానీ టిక్‌టాక్ స్టార్‌పై విషప్రయోగం..

పాకిస్తాన్‌లో మహిళల హక్కులకు ప్రాధాన్యతే లేకుండా పోయింది. ముఖ్యంగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టిక్‌టాక్ స్టార్లు హత్యలకు గురవుతున్నారు. వీరిపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా, పాకిస్తాన్ టిక్‌టాక్ స్టార్ సుమీరా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. సింధ్ ప్రావిన్సులోని ఘోట్కి జిల్లాలోని బాగో వా ప్రాంతంలో తన ఇంట్లోనే చనిపోయింది.

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు

గత కొన్ని రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో నేడు వర్షం తెరిపిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి వరద నిలకడగా ఉందని ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులు ఉందని పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

జస్టిస్ ఘోష్ రిపోర్టు సిద్ధం

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జస్టిస్ పీ.సీ. ఘోష్ నేతృత్వంలోని కమిషన్ తన నివేదికను రేపు (సోమవారం) ఉదయం ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదికతో పాటు, ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను కూడా రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

జస్టిస్ ఘోష్ నివేదిక అందిన తర్వాత, ఈ రెండు కమిషన్ల నివేదికలను మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతే ఈ నివేదికలపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు కమిషన్ల నివేదికలు రాష్ట్రంలో వివిధ అంశాలపై కీలక సిఫార్సులు చేసి ఉంటాయని భావిస్తున్నారు.

కాగా, విద్యుత్ సంస్థల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్ కమిషన్ తన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలపై లోతైన విశ్లేషణ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఉన్నట్లు సమాచారం.

తల్లిదండ్రులు, సోదరిని నరికి చంపిన వ్యక్తి.. ఎందుకంటే..?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘాజీపూర్ జిల్లాలోని డెలియా గ్రామంలో ఓ కొడుకు తన తల్లి, తండ్రి, సోదరిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రాంతాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితుడిని అభయ్ యాదవ్‌గా గుర్తించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. జిల్లా ఎస్పీ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని కేసును ధృవీకరించారు. మృతులను శివరామ్ యాదవ్, అతని భార్య, కుమార్తెగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. పొదల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను కనుగొన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శివరామ్ యాదవ్ తన భూమిలో కొంత భాగాన్ని తన కుమార్తెకు బదిలీ చేశాడు. దీనికి అతడి కుమారుడు అభయ్ అడ్డు చెప్పాడు. ఈ శనివారం తీవ్ర మలుపు తిరిగింది.

బీసీలకు న్యాయం చేయగల పార్టీ ఒక్క బీఆర్‌ఎస్ మాత్రమే

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బీసీల హక్కుల విషయంలో కేసీఆర్‌ తప్ప మరెవ్వరూ నిజాయితీగా న్యాయం చేయలేరని స్పష్టం చేశారు. పరకాలలోని లలితా కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టుమిషన్లు, కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేశారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, శంకర్‌ నాయక్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

సభలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవే రాజకీయ జీవితానికి ప్రాణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమాన్ని నిర్వహించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని అభినందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, “ఎక్కడ తులం బంగారం, ఎక్కడ రైతుబంధు రూ. 15 వేల రూపాయలు?” అని ప్రశ్నించారు. ప్రజలతో మోసపూరిత రాజకీయాలు చేస్తోందని రేవంత్‌ ప్రభుత్వంపై ఆరోపించారు.

లవర్‌తో అభ్యంతరకర స్థితిలో భార్య.. చివరకు భర్త హత్య..

భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. భార్య, ఆమె లవర్ ఇద్దరూ కలిసి అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగింది. భార్య, ఆమె లవర్ ఇద్దరు శృంగారం చేస్తుండగా భర్తకు దొరికారు. దీని తర్వాత కొన్ని రోజులకే వారిద్దరు కలిసి భర్తను హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళకు తల్లిగారి ఇంటికి సమీపంలో నివసించే ట్యూషన్ టీచర్‌తో అక్రమ సంబంధం ఉంది. అయితే, ఈ ఆరోపణల్ని మహిళ ఖండించింది. హత్యకు గురైన వ్యక్తిని 30 ఏళ్ల సోను కుమార్ గా గుర్తించారు. బాధితుడు గురువారం రాత్రి తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. అతడి శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి. శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయిందని పోలీసులు తెలిపారు.

‘‘దేశభక్తి కాదు ప్రచారం’’..భారత క్రికెటర్లపై కనేరియా ఆగ్రహం..

పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్లతో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మ్యాచ్ నుండి వైదొలిగినందుకు మాజీ పాకిస్తాన్ బౌలర్ డానిష్ కనేరియా భారత క్రికెటర్లను విమర్శించారు. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మాజీ స్పిన్నర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మీకు అనుకూలమైనప్పుడు దేశభక్తిని ఉపయోగించడం మానేయండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఖరారైన తర్వాత భారత క్రికెటర్లపై విమర్శలు గుప్పించారు. జూలై 20న బర్మింగ్‌హామ్‌లో నిర్ణయించిబడిని మ్యాచ్‌ను భారత మాజీ క్రికెటర్లు బహిష్కరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, 2025 ఆసియా కప్‌లో రెండు దేశాలు తలపడతాయని శనివారం ధ్రువీకరించబడింది. ఈ నేపథ్యంలోనే కనేరియా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండనున్నాయి. యూఏఈ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

Exit mobile version