నిత్య పెళ్లికూతురు.. 8 మందితో వివాహం, 9వ పెళ్లిలో పట్టుబడిన మహిళ..
ఆమెకు అప్పటికే 8 మంది పురుషులతో వివాహమైంది. పెళ్లి చేసుకోవడం ఎంచక్కా భర్తల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకుంది. చివరకు 9వ పెళ్లి చేసుకునే సమయంలో పోలీసులకు పట్టుబడింది ఈ కిలాడీ ‘‘నిత్య పెళ్లికూతురు’’. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పురుషులను వివాహం చేసుకుని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. పోలీసులు నిందితురాలిని సమీరా ఫాతిమాగా గుర్తించారు. 9వ బాధితుడిని కలిసే సమయంలో పోలీసులకు పట్టుబడింది. నిందితురాలైన వధువు తన భర్తలను బ్లాక్‌మెయిల్ చేసి వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీరా తన భర్తల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఒక ముఠాతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు సమీరా చదువుకున్నదని, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలని తేలింది.
నిమిషా ప్రియా ఉరిశిక్షపై కేంద్రం కీలక ప్రకటన..
యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటుున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మరణశిక్ష రద్దు నివేదికల్ని భారత్ తిరస్కరించింది. ఈ కేసుపై భారత్, యెమెన్‌తో కలిసి పనిచేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) తెలిపింది. ఈ కేసులో తప్పుడు సమాచారంతో ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. అయితే, ఆమెకు విధించిన మరణశిక్షను వాయిదా వేసినట్లు భారతదేశం శుక్రవారం ధ్రువీకరించింది. అయితే, ఉరిశిక్ష రద్దు చేస్తున్నట్లు వస్తున్న నివేదికల్ని తోసిపుచ్చింది.
నిమిషా, ఆమె కుటుంబంతో ప్రభుత్వం క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోందని, సమస్యను త్వరగా పరిష్కరించడానికి స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోందని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ‘‘మా సమిష్టి ప్రయత్నాల ఫలితంగా, యెమెన్‌లోని స్థానిక అధికారులు ఆమెకు శిక్ష అమలును వాయిదా వేశారు. మేము ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాము మరియు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నాము. ఈ విషయంపై మేము కొన్ని స్నేహపూర్వక ప్రభుత్వాలతో కూడా సంప్రదిస్తున్నాము’’ అని అన్నారు.
KPHBలో విషాదం.. 17వ అంతస్తు నుండి దూకి అమ్మాయి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బీ కాలనీలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే 9వ తరగతి విద్యార్థిని లాస్య ప్రియ (13) బాత్రూం కిటికీ నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే, మంజీరా ట్రినిటీ హోమ్స్‌లో 17వ అంతస్తులో నివాసముండే హరినారాయణమూర్తి కుటుంబానికి చెందిన లాస్య ప్రియ, అడ్డగుట్టలోని నారాయణ స్కూల్లో చదువుతోంది. సోమవారం జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్‌లో విద్యాభ్యాసంపై తగిన శ్రద్ధ చూపడంలేదని టీచర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీని తర్వాత ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసమే పనిచేస్తుంది
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకే సేవలు చేస్తోందని కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పని చేస్తోంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ప్రస్తుతం రెండు రకాల పాలన మోడల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి తెలంగాణ మోడల్ కాగా, రెండవది విద్వేష పూరిత పాలన మోడల్. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయానికి దోహదపడుతున్నాయని, ఇవి రాహుల్ గాంధీ మోడల్‌కు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.
దేశంలోని కీలక అంశాలపై కాంగ్రెస్ న్యాయ సదస్సు
డిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నారు.. విజ్ఞాన భవన్లో జరిగే సదస్సులో దేశంలోని పలు కీలక అంశాలపై చర్చించనున్నారు..ఇలా న్యాయపరమైనటువంటి అంశాలపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ప్రసంగిస్తారు.. అంతేకాదు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎజెండా అంశాలపై ప్రసంగిస్తారు.. సదస్సులో మొత్తం 41 మంది ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సమావేశంలో మాజీ న్యాయమూర్తులు, న్యాయవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు పాల్గొననున్నారు..
తాగు నీరు అడిగితే, ఉన్నతాధికారికి “మూత్రం బాటిల్” ఇచ్చిన ప్యూన్..
ఒడిశాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గణపతి జిల్లాలో ఓ ఉన్నతాధికారికి ప్యూన్ తాగునీటికి బదులుగా ‘‘మూత్రం బాటిల్’’ ఇచ్చాడు. అది తాగిన సదరు అధికారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ కేసులో ప్యూన్‌ను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామీణ నీటి సరఫారా, పారిశుధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సచిన్ గౌడకు నిందితుడైన ఫ్యూన్ సిబా నారాయణ్ నాయక్ మూత్ర బాటిల్ ఇవ్వడం సంచలనంగా మారింది. సచిన్ గౌడ అధికారికి ఫిర్యాదు మేరకు నారాయణ్ నాయక్‌ను ఆర్ ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 23న ఆర్‌డబ్ల్యూఎస్ఎస్ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు ప్రకారం, సచిన్ గౌడ, నాయక్‌ను మంచి నీరు అడిగారు. అయితే, నీటికి బదులుగా అతను మూత్రం ఉన్న బాటిల్ ఇచ్చాడు. రాత్రి సమయం కావడం, తక్కువ వెలుగు ఉండటంతో సచిన్ గౌడ ఈ దానిని తాగాడు.
జై బాలయ్య.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’!
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (2023) కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. భగవంత్ కేసరి సినిమాకు అవార్డు రావడంతో బాలయ్య బాబు ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. 2023 సంవత్సరానికి జ్యూరీ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ప్రకటించింది. 2023లో దేశవ్యాప్తంగా విడుదలైన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ సభ్యులు పరిశీలించి.. విజేతలను ఎంపిక చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతల వివరాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘భగవంత్ కేసరి’ని దక్కడంతో ఫాన్స్ ఆనందిస్తున్నారు. బాలయ్య బాబుకు అందరూ విషెష్ తెలుపుతున్నారు.
ట్రంప్ టారిఫ్స్‌పై రాజీ పడే అవకాశమే లేదు: భారత్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే, అమెరికా విధించిన సుంకాలను పట్టించుకునే పరిస్థితి లేదని, భారతదేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఎగుమతులు, దేశ జీడీపీపై తక్కువ ప్రభావం ఉంటుందని, భారతదేశంలో వ్యవసాయం, పాడిపరిశ్రం, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSMEలు) వంటి కీలక రంగాలు రక్షించబడతాయని విషయం తెలిసిన అధికారి తెలిపారు.
ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని, అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని సదరు అధికారి వెల్లడించారు. ‘‘25 శాతం సుంకాలు స్వల్ప ప్రభావం చూపవచ్చు. కానీ ఈ ప్రభావం భారత మార్కెట్లపై అస్సలు ఆందోళనకరమైంది కాదు’’ అని తెలిపారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో భారత దేశ జీడీపీలో 0.2 శాతం కంటే తక్కువ నష్టానికి దారి తీయవచ్చు, దీనిని మెయింటెన్ చేయవచ్చు అని చెప్పారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్‌కౌంటర్‌కి భారీ స్కెచ్..! అడవిలోకి తీసుకెళ్లి…
తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాడు జరిగిన సంచలన విషయాలను వివరించారు. తాను హిందువాహినిలో చేరి యువతను ధర్మం వైపు ఆకర్శితులయ్యేలా కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తమ కార్యక్రమాలకు ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించేవారని, తాము ఎక్కడికి వెళితే అక్కడ 144 సెక్షన్ అమలు చేసేవారని రాజాసింగ్ తెలిపారు. ఎవరైనా హిందువులను మతం మార్చాలని ప్రయత్నిస్తే తాము అడ్డుకునే వాళ్లమన్నారు. మా వల్ల ఏదో ఒక గొడవ జరుగుతోందని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రలు చేసింది. లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపారు. అప్పుడు కూడా ఆగలేదు. జైలుకు వెళ్లాం బయటకు వచ్చాం. మళ్లీ ధర్మం కోసం కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఇలా ఎన్‌కౌంటర్ మిస్టరీని కూడా బయటపెట్టారు.
ఫాల్కన్ స్కాం పై ఈడీ దూకుడు.. 792 కోట్ల మోసం, 18 కోట్ల ఆస్తులు అటాచ్
హైదరాబాద్‌లో మరో భారీ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. వేల మంది నుంచి పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన ఫాల్కన్ స్కామ్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు ఈ స్కాం మొత్తాన్ని 792 కోట్ల రూపాయలుగా గుర్తించిన ఈడీ, ఇప్పటికే 18 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ ప్రకారం, ఫాల్కన్ గ్రూప్ అనే సంస్థ, మొబైల్ యాప్ ఆధారంగా ప్రజలను ఆకట్టుకుని, “పెట్టుబడులను గూగుల్, యూట్యూబ్, మైక్రోసాఫ్ట్‌లో వేస్తున్నాం” అంటూ ప్రచారం చేసింది. భారీ లాభాల ఆశ చూపిస్తూ రెండు వేల కోట్ల రూపాయలకుపైగా ప్రజల నుంచి వసూలు చేసింది.
హైదరాబాద్‌తో పాటు కోల్‌కతాలోనూ ఈ సంస్థ ఆస్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికే ప్రైవేట్ జెట్ సహా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాం వెనుక ప్రధాన నిందితుడు అమర్దీప్, స్కాం బయటపడగానే ప్రైవేట్ జెట్ ద్వారా దుబాయ్‌కు పారిపోయినట్టు సమాచారం.
