Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ వార్నింగ్.. ఈసారి కాలు దువ్వితే..!

అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడి జరిగితే భారీ స్థాయిలో ఎదురుదాడి జరగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడిని ఎత్తి చూపుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. పూర్తిగా రంగంలోకి దిగితే టెహ్రాన్ సామర్థ్యమేంటో రూచి చూపిస్తామని అమెరికా, దాని మిత్ర దేశాలను ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యకలాపాలపై టెహ్రాన్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అణు కార్యకలాపాలను నిలిపివేయాలని ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర టెలివిజన్‌లో ఖమేనీ మాట్లాడుతూ.. అమెరికా, దాని మిత్ర దేశాల శక్తిని ఎదుర్కొనే శక్తి టెహ్రాన్‌కు ఉందన్న సంగతి మరిచిపోవద్దని సూచించారు. టెహ్రాన్‌పై వస్తున్న ఒత్తిడిలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

B-787 విమానాల తనిఖీ పూర్తి.. ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్‌ల్లో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానంలోని ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లాకింగ్ మెకానిజం తనిఖీని పూర్తి చేసిందని, ఎటువంటి లోపం లేదని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ 787 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ విధానం గురించి మా ఇంజనీరింగ్ బృందం వారాంతంలో జాగ్రత్తగా దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు పూర్తయింది. దానిలో ఎటువంటి లోపం బయటపడలేదని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానాలను థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ (TCM) తో భర్తీ చేశామని, ఇందులో FCS ఒక భాగమని కూడా ఆ అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ముందు టేకాఫ్ అయిన వెంటనే ఇంధన స్విచ్‌లు ఆఫ్ అయ్యాయని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ప్రకారం, బోయింగ్ 787, 737 విమానాలలో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సోమవారం అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది.

హెచ్‌సీఏ కుంభకోణం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితులు సీఐడీ కస్టడీలోకి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్‌గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో, ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సీఐడీ జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది. కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్‌, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌ అధ్యక్షురాలు కవిత యాదవ్, సెక్రటరీ రాజేందర్ యాదవ్ ఉన్నారు. వీరిపై హెచ్‌సీఏ క్లబ్‌లలో జరిగిన అవకతవకలు, గత ఎన్నికల్లో చోటు చేసుకున్న అనుమానాస్పద పరిణామాలపై సీఐడీ అధికారులు లోతుగా విచారించనున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్

వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల హోమ్ టీ20 సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు అతని చివరి మ్యాచ్‌లు కానున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం 37 ఏళ్ల రస్సెల్ విండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు జమైకాలోని సబీనా పార్క్‌లో జరుగనున్నాయి. ఇది ఈ ఆల్ రౌండర్ హోమ్ గ్రౌండ్. అతను తన సొంత మైదానం నుంచే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. అతని రిటైర్మెంట్ విషయాన్ని విండీస్ క్రికెట్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది. రస్సెల్ 2019 నుంచి వెస్టిండీస్ తరపున T20Iలు మాత్రమే ఆడుతున్నాడు. వెస్టిండీస్ తరపున 84 T20I మ్యాచ్‌లు ఆడాడు, 22.00 సగటు, 163.08 స్ట్రైక్ రేట్‌తో 1,078 పరుగులు చేశాడు.

అలస్కాలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

అగ్ర రాజ్యం అమెరికా ప్రకృతి విపత్తులతో అతలాకుతలం అవుతోంది. నిన్నామొన్నటిదాకా వరదలతో టెక్సాక్, మెక్సికో, న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలు అల్లాడిపోయాయి. పదులకొద్దీ జనాలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆస్తి ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భద్రతా సూచనలు పాటించాలని ప్రజలను అధికారులు కోరారు. పోపోఫ్ ద్వీపంలోని సాండ్ పాయింట్ సమీపంలో 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. దీంతో అలస్కా తీరప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగా అలాస్కాలో భూకంపం సంభవించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ భూకంపం కారణంగా భారీగా నష్టం జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు.

పాకిస్తాన్ కోసం గూఢచర్యం.. జమ్మూ కాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కు సైనిక రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ (SSOC) భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడిని అరెస్టు చేసింది. పంజాబ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు. జూలై 14న జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి నుంmr అతన్ని అరెస్టు చేశారు. గూఢచర్యం ఆరోపణలపై నిర్బంధించబడిన మాజీ సైనికుడు గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గుర్రి లేదా ఫౌజీ అరెస్టు తర్వాత ఈ అరెస్టు జరిగింది. గుర్ప్రీత్ సింగ్‌ను విచారించగా, అతను ఫిరోజ్‌పూర్ జైలులో ఉన్నప్పుడు, దేవిందర్ సైన్యం సున్నితమైన పత్రాలను పొందడంలో పాల్గొన్నాడని తేలింది. ఈ పత్రాలలో రహస్య సమాచారం ఉందని, దానిని అతను పాకిస్తాన్ ఐఎస్‌ఐకి అందజేశాడని ఆరోపించారు.

బంగారం అక్రమ రవాణా కేసు.. కన్నడ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఈ ఉత్తర్వును విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) సలహా బోర్డు ఆమోదించింది. ఇందులో రన్యా రావుతో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం, ఒక సంవత్సరం జైలు శిక్ష కాలంలో ముగ్గురూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోల్పోయారు. అంటే, వారిలో ఎవరూ మొత్తం శిక్షా కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన ‘మాణిక్య’ సినిమాలో నటించిన ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇతర దక్షిణ భారత చిత్రాలలో కూడా నటించింది. ఈ ఏడాది మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారంతో రణ్య రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది. రణ్య తరచుగా అంతర్జాతీయ పర్యటనలు చేస్తున్నందున ఆమెపై DRI నిఘా పెట్టింది. మార్చి 3న రాత్రి ఆమె దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో బెంగళూరుకు చేరుకున్న సమయంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం.. ఈ ఏడాదిలో అయిదో సారి!

ఈ సీజన్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వైఫల్యం కొనసాగుతోంది. ఈ ఏడాదిలో సింధు తొలి రౌండ్లోనే ఐదవసారి ఓడిపోయింది. తాజాగా జపాన్ ఓపెన్ 2025 సూపర్ 750 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యు జిన్ చేతిలో వరుస గేమ్‌ ( 15-21, 14-21)లలో సింధు పరాజయం పాలైంది. సింధుపై సిమ్ యు జిన్ తన కెరీర్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. లక్ష్యసేన్ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లక్ష్యసేన్‌ 21-11, 21-18తో చైనా ఆటగాడు వాంగ్‌ జెంగ్‌ షింగ్‌పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో అనుపమ 21-15, 18-21, 21-18తో రష్మికశ్రీపై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్ చేరింది. మరోవైపు డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి సైతం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో 21-18, 21-10తో కాంగ్‌ మిన్‌ హ్యుక్‌- డాంగ్‌ జు (కొరియా) జంటను ఓడించారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌- రుబన్‌ కుమార్‌, మహిళల డబుల్స్‌లో కవిప్రియ సెల్వం- సిమ్రన్‌ సింఘిలు ఓడిపోయారు.

రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఎండలు ఉక్కపోతతో చికాకుపడుతున్న ప్రజలకు ఇది కొంత ఊరటను కలిగించనుంది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 340 మండలాల్లో వర్షపాతం లోపం నమోదైన నేపథ్యంలో, ఈ వర్ష సూచన కొంత ఉపశమనం కలిగించనుంది. రేపు (గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా శుక్రవారం రోజు మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీవర్ష సూచన ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశమున్నట్లు అంచనా వేయబడింది.

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ చాలా దగ్గరగా ఉందని ట్రంప్ తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 1 ఒక ముఖ్యమైన రోజు అవుతుందని.. ఆ రోజు తన దేశానికి చాలా డబ్బు వస్తుందని వ్యాఖ్యానించారు. సుంకాలపై ట్రంప్ విధించిన గడువు దగ్గర పడుతోంది. ఆగస్టు 1తో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఒప్పందం చేసుకోవడానికి చాలా దగ్గరగా ఉందని ట్రంప్ పేర్కొ్న్నారు. త్వరలో భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య చర్చలు జరుగుతున్నాయని సూచించారు. భారత మార్కెట్లలోకి ప్రవేశం కల్పించే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని పేర్కొ్న్నారు. ఇక ఇండోనేషియాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ఇండోనేషియా 19 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

 

Exit mobile version