Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. బోరున విలపించిన కెప్టెన్ సల్మాన్ అఘా!

దుబాయ్ గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ సల్మాన్ అఘాకు ఘోర అవమానం జరిగింది. అఫ్ఘానిస్థాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న పాక్‌ సారథిని ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అటు నవ్వలేక, ఇటు ఏడ్వలేక అలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని వదలరుగా అంటూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆసియా కప్‌ స్టార్ట్ కాబోతుంది. వచ్చే నెల 5న యూఏఈకి టీమిండియా చేరుకోనునంది. ఇప్పటికే అక్కడికి పాకిస్థాన్, శ్రీలంక టీమ్స్ చేరాయి. ఈ సందర్భంగా ఆయా జట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అక్కడ ఓ జర్నలిస్ట్ ‘ఆసియాలోనే రెండో అత్యుత్తమ జట్టు అఫ్గనిస్థాన్ గత వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడింది.. మరి ఈసారి ఆసియా కప్‌ కోసం ఎలా రెడీ అవుతున్నారని ప్రశ్నించాడు. దీంతో ఆ పక్కనే ఉన్న పాక్‌ కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు కింది వీడియోలో కనిపించింది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్‌ టీమ్ అంటే గతంలో ఓ మర్యాద ఉండేది. కానీ, ఈసారి మాత్రం బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతోనే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయని నెట్టింట చర్చ జరుగుతుంది.

మోడీ తల్లిని తిట్టినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే..

బీహార్ ​లో ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఇండియా కూటమి నేతలు చేసిన వివాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. యాత్ర సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు అనుచిత పదజాలాన్ని వాడటం దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట.. తాడిపత్రి ఎంట్రీకి సుప్రీం గ్రీన్‌ సిగ్నల్

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట లభించినట్టు అయ్యింది.. పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు.. తనను తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.. అయితే, తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాదులు సిద్ధార్థ దవే, పి .సుధాకర్ రెడ్డి , అల్లంకి రమేష్.. అయితే, నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు? అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలని సూచించింది.. ఇదే సమయంలో తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఇక, పోలీసు సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు అంగీకరించారు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు..

భారీ వరదలో బోటు బోల్తా.. మెదక్ జిల్లాలో ఆర్మీ జవాన్లకి తప్పిన పెను ప్రమాదం..

మెదక్ జిల్లాలో ఆర్మీ జవాన్లకి పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ కోసం ట్రయల్ వేస్తుండగా బోటు బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జవాన్లను రక్షించేందుకు రంగంలోకి దిగారు. తాళ్ల సాయంతో జవాన్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా ఈ నెల 27న వినాయకుని విగ్రహం కొనుగోలు చేసేందుకు కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు మెదక్ కు వచ్చారు. భారీగా కురిసిన వర్షాలతో పోచారం వరద ఎక్కువ కావడంతో మూడు రోజులుగా పోచమ్మరాల్ గ్రామంలో చిన్నారులు తలదాచుకున్నారు.

మా నైతికతను ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాదు..!

మా నైతికతను ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాని పని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత భూమాన కరుణాకర్‌రెడ్డి.. ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎంపీ మిథన్‌రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా.. ములాఖత్‌లో మిథున్‌రెడ్డిని కలిశారు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భూమన.. దొంగ నోట్ల, దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమే కాదు అన్నారు.. వైసీపీ నేతలను, కార్యకర్తలను ఛంబల్‌ లోయ దొంగలుగా వెంటాడుతున్నారు.. వైసీపీ నేతలను జైల్లో కుక్కడం ఆనవాయితీగా మరింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర పని చేసిన నిజాయితీ అధికారులను, ఆప్తులను కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది. ఇటువంటి అరెస్టులకు మేం భయపడబోం.. మా నైతికతను ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు..

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. నేటి (ఆగస్టు 29) నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వాహన రాకపోకలపై పరిమితులు ఉండనున్నాయి. పోలీసుల ప్రకారం, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో భారీగా వాహనాల రాకపోకలు ఉండే అవకాశం ఉన్నందున మోటార్ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

హృదయవిదారక ఘటన.. తల్లికి పురుడు పోసిన కూతురు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తల్లికి కూతురే పురుడుపోసింది. ఇది పరిషత్ కార్యాలయం చుట్టుపక్కల వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. తల్లి, బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. శిశువుకు డాక్టర్లు అత్యవసర వైద్యం అందించారు. తల్లి, శిశువును సురక్తితంగా ఉన్నారు. గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని అక్కేన వలస గిరిజన గ్రామానికి చెందిన దుబ్బాక పార్వతి తన కూతురుతో కలిసి పని మీద మండల పరిషత్ కార్యాలయానికి వచ్చింది. అనూహ్యంగా కార్యాలయం ఆవణలోనే పార్వతికి పురిటి నొప్పిలు వచ్చాయి. దాంతో ఆమె కదలలేక అక్కడే ఉండిపోయింది. తల్లి పడుతున్న బాధలను చూసిన కూతురు.. దగ్గరుండి మరీ పురుడుపోసింది. పార్వతికి ఇది ఆరువ ప్రసవం కాగా.. ఈసారి కూడా ఆమెకు ఆడబిడ్డే జన్మించింది.

వందే భారత్ పై రైల్వే కీలక నిర్ణయం.. ఆ రూట్లో

దేశంలో సాధారణ వ్యక్తి దగ్గర నుంచి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కడికి అందుబాటు ధరలో ఉండే ఏకైక ప్రయాణం రైల్వే. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఏకైక మార్గం రైల్వే ప్రయాణం. రోజు కోట్ల మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. అయితే పండగవేళల్లో ఆ రద్దీ మామూలుగా ఉండదు. అందుకే నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు. ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు కేంద్రం వందే భారత్ రైళ్లు తీసుకొచ్చింది. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గింది. అయితే వందే భారత్ రైళ్లు ఇకపై మరింత ఎక్కువ కోచ్‌లతో నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో 20 బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

జీఎస్టీ రేషనలైజేషన్ వల్ల రాష్ట్రాలకు భారీ నష్టం

ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన తెలిపారు, “అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే దేశం బాగుంటుంది. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాలి. రేషనలైజేషన్‌ను మేము ఆహ్వానిస్తున్నాం కానీ, రాష్ట్రాలకు జరిగే నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలి” అని స్పష్టం చేశారు.

కష్టపడ్డాను, గెలిచాను.. కష్టమైన విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చా!

పారిశ్రామిక విప్లవం చూశాం అని, ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధ) విప్లవం చూస్తాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏఐతో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారన్నారు. తాను మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయానని.. ఆపై ఐదేళ్ల పాటు కష్టపడి గెలిచానని తెలిపారు. కష్టమైన విద్యాశాఖ తీసుకుని.. మార్పు తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థులే మన ఆస్తి అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. సైయెంట్ ఆధ్వర్యంలో విశాఖలో ఏఐ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు.

Exit mobile version