Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రామ్ చరణ్ సినీ ప్రయాణంలో 18 ఏళ్లు పూర్తి.. “పెద్ది” నుంచి మాస్ పోస్టర్ విడుదల!

2007లో చిరుత సినిమాతో చేసిన అరంగేట్రం ఈ రోజు 18 సంవత్సరాల మైలురాయిని తాకింది. మొదటి సినిమాలోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్. ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ లాంటి క్లాస్ అండ్ మాస్ మిశ్రమ చిత్రాలతో వరల్డ్ వైడ్ రెకగ్నిషన్ తెచ్చుకున్నాడు. రామరాజు గా కనిపించి హాలీవుడ్ వరకు మెప్పించాడు.

పదేళ్లు నాకు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ కి పోటీగా తయారు చేస్తా

భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తొలి పునాది రాయి వేసిన సీఎం సభావేదిక పై పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా.. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విజయదశమి మనకు అన్ని విజయాలను చేకూరుస్తుందని.. చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ రేవంత్‌కు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. నాకు భూములు ఉంటే అందరికీ కనిపిస్తాయి.. దాచిపెడితే దాగవు.. కుతుబ్ షాహీలు నగరాన్ని నిర్మిస్తే, వైఎస్సార్, చంద్రబాబు దాన్ని కొనసాగించారు. ఆ నాయకులు ఆలోచన చేశారు కాబట్టే.. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నాం. వారు మాకెందుకులే అనుకుంటే ఓఆర్ఆర్, శంషాబాద్, హైటెక్ సిటీ వచ్చేవి కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీలోనే.. అభివృద్ధికి కేర్ అఫ్ అడ్రస్

భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తొలి పునాది రాయి వేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనుందని పేర్కొన్నారు. ఏ నగరానికి లేని వ్యవస్థ తెలంగాణకు రాబోతోందని, ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించబడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు కూడా తీసుకువచ్చారని, ఇది కేవలం పాత నగరం కాదని, ఒరిజినల్ సిటీ అని సీఎం చెప్పినట్లు భట్టి గుర్తు చేశారు.

దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల పర్యటన.. నామీ ద్వీపం సీఈవోతో భేటీ

ఏపీ మంత్రుల బృందం ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా నామీ ద్వీపం సీఈవో మిన్ క్యోంగ్ వూతో రాష్ట్ర మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. సహజసిద్ధమైన సాంస్కృతిక, సాంప్రదాయ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన నామీ ఐలాండ్‌ను వారు సందర్శించారు. అయితే, సియోల్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటైన నామీ ఐలాండ్, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో పాటు సంవత్సరం మొత్తం సంగీత ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ట్విట్టర్లో కౌంటర్.. డీవీవీ నిర్మాణ సంస్థపై కేసు

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘OG’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టి పిటిషనర్ అడ్వకేట్ బర్ల మల్లేష్ యాదవ్‌ను కించపరిచినట్టు ఆయన ఆరోపణలు చేశాడు. ఈ ఘటనపై తీవ్రంగా తప్పుబట్టిన మల్లేష్ యాదవ్, ఆ సంస్థకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు పంపుతున్నానని, లీగల్ నోటీసులు జారీ చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు.

తొక్కిసలాట డీఎంకే కుట్ర.. సీబీఐ దర్యాప్తు కోసం కోర్టుకు విజయ్..

టీవీకే అధినేత, స్టార్ యాక్టర్ విజయ్, నిన్న తమిళనాడు కరూర్‌లో నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాట జరిగి 40 మంది మరణించారు. 100 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ ఘటన వెనక డీఎంకే కుట్ర ఉందని టీవీకే పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని టీవీకే న్యాయవాది అరివాజగన్ తెలిపారు. కరూర్ ర్యాలీలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించామని ప్రభుత్వం ఆరోపించడాన్ని ఆయన తోసిపుచ్చారు.

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించిన ముఖ్యమంత్రి, త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.

ఛత్తీస్‌గఢ్‌‌లో బీకర కాల్పులు.. ముగ్గురు నక్సలైట్లు మృతి

దేశంలో నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్‌లో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి. చింద్‌ఖరక్ అడవిలో భద్రతా దళాలు ముగ్గురు నక్సలైట్లను హతమార్చాయి. మృతి చెందిన ముగ్గురు నక్సలైట్లపై రూ.1.4 మిలియన్ల రివార్డ్ ఉంది. కాంకేర్-గారియాబంద్ DRG, BSF దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య సుదీర్ఘమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు ఒక మహిళతో సహా ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను గుర్తించారు.

40 మంది ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఇదే: ప్రత్యక్ష సాక్షులు

తమిళనాడులోని కరూర్‌లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది పిల్లలు సైతం ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. ఇంతలో తొక్కిసలాట గురించి ముఖ్యమైన సమాచారం వెలువడుతోంది. ర్యాలీలో జనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. విజయ్ షెడ్యూల్ చేసిన సమయం కంటే ఆలస్యంగా వచ్చారు. మండుతున్న వేడిలో ఎక్కువసేపు నిలబడటం వల్ల కొంతమంది అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారని తెలుస్తోంది. దీంతో మిగతా వాళ్లు సైతం భయాందోళనకు గురై తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు.

 

Exit mobile version