NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన

బీహార్‌లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వంతెన కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వంతెన పాతదని ఓ అధికారి తెలిపారు. వంతెన కూలిపోవడంతో సమీపంలోని డజన్ల కొద్దీ గ్రామాలతో కనెక్టివిటీ కోల్పోయింది. జిల్లాలోని దారుండా బ్లాక్‌లోని రామ్‌గర్హ పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. వంతెన చాలా పాతది చెబుతున్నారు.

జగన్ కాన్వాయ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాన్వాయ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది.. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం వెళ్లారు జగన్.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు.. ఇక, కడప విమానాశ్రయం నుండి పులివెందుల వెళ్తుండగా.. జగన్‌ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.. నరసరామ్ పల్లి సమీపంలో వైఎస్‌ జగన్ చూసేందుకు ఎగబడ్డారు ప్రజలు. దీంతో.. ఆకస్మికంగా జగన్ కాన్వాయ్ ఆపాల్సి వచ్చింది.. ఈ సమయంలో.. కాన్వాయ్ లో ఉన్న ఫైరింజన్‌ వాహనాన్ని ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది.. అయితే, జగన్‌ కాన్వాయ్‌లో జరిగిన ప్రమాదంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా? ఇంకా ఏం జరిగింది అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

త్వరలో ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం..

బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.అలాగే ఈ కార్యక్రమానికి బసవతారకం కాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అలాగే డా.నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.బసవతారకం హాస్పిటల్ ఎంతో మంది పేదలకు సేవలందిస్తోందని ఆయన తెలిపారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకే ఈ హాస్పిటల్ నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్థకు అనుమతులపై తన దృష్టికి రాగానే కేబినెట్‌లో చర్చించి పరిష్కరించామని ఆయన వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రైతులపై మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలతో వేధిస్తే.. కాంగ్రెస్ కిసాన్ న్యాయ్ కు కట్టుబడి ఉందన్నారు. రైతు రుణమాఫీ పై తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని 40 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా..

ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఇండో-అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో హెల్త్ టూరిజం హబ్‌ను ప్రకటించారు. అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు. అందులో బసవతారకం ఆసుపత్రికి తప్పకుండా స్థానం ఉంటుంది. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచంలోని ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఆలోచనలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవ చేయడం ఆనందదాయకమని రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని నిర్మించారన్నారు.

అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్

అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. తనను కలిసి.. సమస్యలు చెప్పుకోవాలనుకునే వారికి ప్రజా దర్బార్ ఓ వేదిక అని పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు – మంత్రి లోకేష్ చిట్ చాట్‌గా మాట్లాడారు. ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఎయిర్ పోర్టు పని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును నారా లోకేష్ అడిగారు. ఈ క్రమంలో రెండేళ్లలో పూర్తి చేస్తామని రామ్మోహన్‌ నాయుడు సమాధానం ఇచ్చారు. రెండేళ్లా..? ఇంక త్వరగా పూర్తి చేసేయండని రామ్మోహన్నాయుడును మంత్రి లోకేష్ కోరారు. ప్రయత్నిస్తానంటూ రామ్మోహన్నాయుడు రిప్లై ఇచ్చారు.

ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి రవి

ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టు ఉందని, ఆయన ఈ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు. రాష్ట్రంలో డిమాండ్ సప్లైపై దృష్టి సారిస్తున్నామన్నారు. త్వరలోనే డిపార్ట్మెంట్‌తో కూర్చొని పూర్తి స్థాయి సమీక్ష చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం మనమందరం కలిసికట్టుగా పని చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి రవిని మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమాట్ల ధర్మరాజు, రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి వాసులు అభినందించారు.

రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదు..

నల్లగొండ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజర్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారులు ఎక్కువ చేస్తే బదిలీలు ఉండవు.. డైరెక్ట్‌గా రిమూవ్ చేయడమే

రేషన్ కార్డ్ ఏ కాదు ఏదైనా అనర్హులైన వారు వారి అంతట వారే తప్పుకుంటే మంచిదన్నారు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ధనుకులకి కాదు బీదవారి ప్రభుత్వమని, ప్రజలకి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎవరైనా అధికారులు ఎక్కువ చేస్తే నా పాలనలో ట్రాన్స్ఫర్లు ఉండవు డైరెక్ట్గా రిమూవ్ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకి ఎంత బాధ ఉంటే మీ మీద కంప్లైంట్ చేస్తారు అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని ఆయన అన్నారు.

అసెంబ్లీలో పవన్‌ కల్యాణ్ తొలి ప్రసంగం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎ పవన్‌ కల్యాణ్ సహా పలువురు కూటమి సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు చాలా సీనియర్‌ నేత అని, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత సభాపతి స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవన్‌ తన ప్రసంగంలో హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో అయ్యన్నపాత్రుడిని ప్రశంసించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. అసెంబ్లీలో పవన్ తొలి ప్రసంగం వీడియో మీ కోసం..

 

Show comments