Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఈ పనుల కోసం కొత్త డిజైన్లు అవసరమని నిర్ణయించి, కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖకు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌ (సీడీవో) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ డిజైన్లు తప్పనిసరిగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌యే) సూచనలు, దర్యాప్తు నివేదిక ఆధారంగా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పరిశీలన జరగనుంది. సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో భద్రపరచనుంది.

టీమిండియా బౌలర్ల దెబ్బకి కుప్పకూలిన విండీస్.. 162 ఆలౌట్

అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు భారీ ఒత్తిడిని ఎదుర్కొవడంతో టీమిండియా బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలవలేక 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ జట్టు ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ట్యాగెనరైన్ చాందర్‌పాల్ డక్ అవుట్ కాగా.. జాన్ కాంప్‌బెల్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. మధ్యలో అలిక్ ఆథనేజ్ (12), బ్రాండన్ కింగ్ (13) కూడా ఎక్కువగా రాణించలేకపోయారు. ఆ తర్వాత కెప్టెన్ రోస్టన్ చేజ్ (24), షై హోప్ (26) కొంత ప్రతిఘటన చూపినా అది భారీ స్కోరు కోసం సరిపోలేదు. ఇక విండీస్ మొదటి ఇన్నింగ్స్ లో జస్టిన్ గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

జనసేన ఆత్మీయ సమావేశం.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో విజయదశమిని పురస్కరించుకొని జనసేన పార్టీ జిల్లా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ రాష్ట్ర అభివృద్ధిలో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు.. పవన్ కల్యాణ్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల అభిమాన్ని చూరగొన్నాయన్న ఆయన.. పవన్ చేపట్టిన శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రజాధరణ పొందాయని ప్రశంసించారు.. దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరించారు అంటూ పవన్‌ కల్యాణ్‌ను అభినందించారు కందుల దుర్గేష్‌..

“ఇంటింటా స్వదేశీ.. ప్రతి ఇంటా స్వదేశీ” నినాదంతో ముందుకెళ్లాలి..

ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు.. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఏర్పాటుచేసిన ఖాదీ సంతను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. . రెండు రోజులు పాటు ఖాదీ సంత నిర్వహించనున్నారు.. ఖాదీ ఫర్ నేషన్ – ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ ఖాదీ సంత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40 స్వదేశీ వస్తువుల స్టాల్స్ ను సోము వీర్రాజు పరిశీలించారు. స్వదేశీ వస్తువుల విక్రయాలకు సంబంధించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోము వీర్రాజు వీడియోతో మాట్లాడుతూ.. స్వదేశీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా ఖాదీ సంత నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు.. ఖాదీ చేతి వృత్తులు చేనేత హస్తకళలు సేంద్రియ ఉత్పత్తులు ఆయుర్వేదం మిల్లెట్స్ , మొక్కలు పై విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు మోడీ ఫోన్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (83)కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లుగా ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు పేస్‌మేకర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చేరారు.

హిందూ దేవుళ్లపై జోకులు.. మునావర్ ఫరూఖీ హత్యకు గ్యాంగ్‌స్టర్ ప్లాన్..

స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని గ్యాంగ్ స్టర్లు రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్‌లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హిందూ దేవుళ్లపై జోకులు వేయడం ద్వారా మునావర్ వారికి హిట్ లిస్టులోకి వచ్చాడు. హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్న మునావర్ ఫరూఖీ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రకు పాల్పడిన కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం భగ్నం చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. హర్యానాలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులైన రాహుల్, సాహిల్ అనే షూటర్లు ఇటీవల ఢిల్లీలో కనిపించారని ఢిల్లీ పోలీసు కౌంటర్-ఇంటెలిజెన్స్ బృందానికి సమాచారం అందిందని సోర్సెస్ వెల్లడించాయి. ఇద్దరిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్లాన్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో, కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు వీరిని అరెస్ట్ చేసి, వీరి వద్ద నుంచి తుపాకులు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

వరుణ్ తేజ్, లావణ్యల కొడుకు పేరు ఏంటో తెలుసా?

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య దంపతులు ఈమధ్య ఒక మగ బిడ్డకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. దీంతో మెగా కుటుంబానికి వారసుడొచ్చాడంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇక తాజాగా ఆ బుడతడికి తల్లిదండ్రులు నామకరణం చేశారు. మెగా వారసుడికి ‘వాయుయ్వ్ తేజ్’ అంటూ నామకరణం చేసినట్లు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ ముకుందా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా, లాంచింగ్ కి మాత్రం గట్టిగానే ఉపయోగపడింది.

పండుగవేళ నల్గొండలో తీవ్ర విషాదం..

దసరా పండుగ రోజు నల్గొండ జిల్లా విషాదంలో మునిగిపోయింది. చందంపేట మండలం దేవరచర్ల డిండి వాగులో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తొలుత వాగులోకి దిగిన సాయి ఉమాకాంత్ (10) అనే బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయాడు. అతడిని రక్షించేందుకు రాము (30), గోపి (21) వాగులోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. దసరా పండుగను జరుపుకోవడానికి తెనాలి నుంచి బంధువుల ఇంటికి వచ్చిన వీరి మరణం కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేసింది.

“ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, చైనాపై ప్రశంసలు”.. కొలంబియాలో రాహుల్ గాంధీ..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాల్లో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంపై దాడి భారత్‌కు అతిపెద్ద ముప్పు అని అన్నారు. భారత్‌లో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, ప్రజాస్వామ్య విధానం అందరికి స్థానం కల్పిస్తుందని, కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

టికెట్‌ ధరలు పెంచకుండా 150 కోట్లు వసూలు చేసిన మిరాయ్

సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్‌ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్‌హిట్‌ ట్రాక్‌పై దూసుకెళ్తోంది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సీజన్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. గట్టి పోటీ మధ్య కూడా మిరాయ్ అద్భుతంగా కంటిన్యూ అవుతోంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో కీలక మైలురాయిని అందుకుంది. హనుమాన్ తర్వాత వరుసగా రెండోసారి 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం తేజా సజ్జా కెరీర్‌కు మైల్ స్టోన్ గా నిలిచింది. రెండు బ్లాక్‌బస్టర్స్‌తో వరుస విజయాలు అందుకున్న ఆయన బాక్సాఫీస్‌ వద్ద డిపెండబుల్ హీరోగా ఎదుగుతున్నారు. రితికా నాయక్ హీరోయిన్‌గా, మనోజ్ మంచు, శ్రీయా శరణ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం, యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్‌ ప్రెజెంటేషన్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. కంటెంట్‌ బలంతో పాటు పండుగ సీజన్‌ కలిసివచ్చి, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. టీమ్‌ మిరాయ్ టికెట్‌ ధరలు పెంచకుండా ఈ విజయాన్ని సాధించింది. భారీ హైప్‌, మంచి రివ్యూలు ఉన్నప్పటికీ సినిమాను అందరికీ అందుబాటులో ఉంచాలనే వారి సంకల్పాన్ని ఇది చూపిస్తోంది. దసరా సెలవులు థియేటర్లలో ప్రేక్షకులను మరింతగా రప్పిస్తుండటంతో మిరాయ్ డ్రీమ్ రన్‌ విజయవంతంగా కొనసాగనుంది.

 

Exit mobile version