Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

దాయాది దేశానికి భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాలను భారత్ నిలిపివేసింది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఇలాంటి తరుణంలో దయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ కీలక అలర్ట్ జారీ చేసింది. తావి నదిలో వరదలు వచ్చే అవకాశం ఉందని భారత్ సూచించినట్లుగా పాకిస్థాన్‌కు చెందిన ది న్యూస్ మీడియా సంస్థ తెలిపింది. వరదలు వచ్చే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్‌ను భారత్ సంప్రదించినట్లుగా మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ హెచ్చరికను తెలియజేసిందని ఆ పత్రిక తెలిపింది.

చైతన్యం అందించిన ఓయూను కాలగర్భంలో కలపాలని చూశారు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివి.. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులే.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ఈ యూనివర్సిటీ విద్యార్థినే.. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది యూనివర్సిటీలోనే.. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ.. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉస్మానియా యూనివర్సిటీ..

విషాదం.. కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్‌ లో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని దినేష్ కుటుంబం తెలిపింది. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు కేజీఎఫ్‌ మూవీతో మంచి గుర్తింపు లభించింది.

శుభవార్త.. ఖాతాల్లో తల్లికి వందనం సొమ్ము..!

తల్లికి వందనం పథకంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జమకానుంది.. మరోవైపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్..

గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు.. జర్నలిస్టులు సహా 15 మంది మృతి

గాజాను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకు దూసుకుపోతుంది. ఇందులో భాగంగా దాడులను ఉధృతం చేసింది. సోమవారం గాజా ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారు. ఈ మేరకు గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన జర్నలిస్టుల్లో ఒకరు అల్ జజీరాకు చెందినవారు కాగా.. మరొకరు రాయిటర్స్‌కు చెందినవారని పేర్కొంది. నాసర్ ఆస్పత్రిలోని నాల్గవ అంతస్తుపై దాడి జరిగిందని.. రెస్క్యూ సిబ్బంది పైకి వెళ్లేలోపే రెండో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లుగా సమాచారం. తాము హమాస్ ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

దాడి చేశానని నిరూపిస్తే బహిరంగంగా మోకాళ్లపై కూర్చొని క్షమాపణ చెప్పేందుకు సిద్ధం

రెండు రోజుల క్రితం శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై జరిగిన ఘటనపై ఇటు ప్రతిపక్ష పార్టీలో, అటు సొంత పార్టీలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వైస్సార్సీపీ నాయకులు అబంటీ రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం నియోజకవర్గం ఆయన సెటైర్లు వేశారు. శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో మద్యం సేవించి అటవీ శాఖ సిబ్బంది పై దాడి చేశానని వైస్సార్సీపీ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణిరెడ్డి నోటికి వచ్చినట్లు వాగుతున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మండిపడ్డారు.

డ్రీమ్‌ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు.. ఐపీఎల్‌కూ రాంరాం!

భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్‌ 11’తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందంను రద్దు చేసుకుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నేపథ్యంలో.. బీసీసీఐ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్‌ సైకియా తెలిపారు. కొత్త చట్టం కారణంగా ఒప్పందాన్ని కొనసాగించలేమని డ్రీమ్‌ 11 ప్రతినిధులకు బీసీసీఐ స్పష్టం చేసింది.

పూజకు పిలిచిన మోసగాళ్లు.. పురోహితుడి జేబే ఖాళీ చేశారు.!

హైదరాబాద్ నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగుచూసింది. 52 ఏళ్ల వయసు గల ఓ పురోహితుడు నేరగాళ్లకు బలై, లక్షల రూపాయలు కోల్పోయాడు. పాతబస్తీ పురానాపూల్ ప్రాంతానికి చెందిన ఈ పురోహితుడిని సైబర్ దుండగులు పూజ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే… సికింద్రాబాద్ మిలిటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు మోసగాళ్లు ఆ పురోహితుడికి ఫోన్ చేశారు. “మా కల్నల్ సర్ ఆరోగ్యం బాగోలేదు. ఆయన కోసం 11 రోజులపాటు ప్రత్యేక పూజ చేయాలి. దానికి 21 మంది పురోహితులు అవసరం. ఈ పూజకు అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు ఇస్తాం” అని చెప్పి నమ్మించారు. మొదట నమ్మకాన్ని కలిగించేందుకు ఆయన ఖాతాలో రూ.10 పంపించారు.

ఈడీకి భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే..

బూచోళ్లను చూసి చిన్నపిల్లలు పారిపోయినట్లు.. ఈడీని చూసి అవినీతి ప్రజాప్రతినిధులు దడుచుకుంటున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఓ ఎమ్మెల్యే వాళ్ల ఇంటికి దర్యాప్తు కోసం వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను చూసి వెంటనే ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటికి దూకి పారిపోడానికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తన ఫోన్‌ను వెంటనే సమీపంలోని డ్రైనేజీలో విసిరేశాడు. వచ్చిన వాళ్లు సాధారణ వ్యక్తులా ఆయన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టడానికి.. వెంటపడి మరి పెట్టుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. పశ్చిమ బెంగాల్‌లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంపై ED దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు కోసం వెళ్లిన ఈడీ అధికారులను చూసి ఎమ్మెల్యే వాళ్ల ఇంటి ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకి దూకి పారిపోడానికి ప్రయత్నించారు.

లంచం మొత్తం లెక్కపెట్టేలోపే… ఏసీబీ వలలో అధికారి..!

భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. నరసింహారావు అనే ఈ అధికారి, ఎరువుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిబ్బంది నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం, ఎరువుల దుకాణం నిర్వహణకు సంబంధించిన అనుమతుల విషయంలో సాయం చేస్తానని హామీ ఇచ్చిన నరసింహారావు, వ్యాపారవేత్త నుంచి రూ.25 వేల లంచం కోరాడు. దీనిపై విసిగిపోయిన వ్యాపారవేత్త ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

 

Exit mobile version