ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం లేదు.. జేడీ వాన్స్ కీలక ప్రకటన
ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల తర్వాత.. ఇరాన్‌కు అణు సామర్థ్యం లేదని ప్రకటించారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. శనివారం ఇరాన్ అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా అత్యంత శక్తివంతమైన బాంబర్లు దాడి చేశాయి.
ఐదుసార్లు తప్పించుకున్న తేజేశ్వర్… ఆరోసారి బలయ్యాడు.. సంచలన విషయాలు వెలుగులోకి
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయిన తేజేశ్వర్‌ను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. తేజేశ్వర్ స్థానికంగా ప్రైవేట్ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితమే ఐశ్వర్య అనే యువతిని ప్రేమించి, పెద్దల వ్యతిరేకతను ఎదుర్కొంటూ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ వివాహితుడు అయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో ప్రేమ సంబంధం ఉంది. తన భార్యకు పిల్లలు లేనని చెప్పి, ఐశ్వర్యను రెండో భార్యగా తీసుకునేందుకు ఆమెతో చీకటి బంధాన్ని కొనసాగించాడు.
నోటీసులపై స్పందించని చెవిరెడ్డి.. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న విజిలెన్స్!
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు విజిలెన్స్ నోటీసులపై స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో తుడాలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం.. రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. తుది నోటీసుకు సోమవారంతో గడువు ముగిసింది. భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలు అధికారుల ఎదుట హాజరుకాకపోవడంతో.. తదుపరి చర్యలకు విజిలెన్స్ సిద్దమవుతోంది. ఇపటివరకు సేకరించిన సమాచారంతోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నారు.
రేపు రోదసిలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణం ఎట్టకేలకు ఖరారైంది. ఆరు సార్లు ప్రయోగం వాయిదా పడింది. బుధవారం యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుందని నాసా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 25న మధ్యాహ్నం 12:01 గంటలకు రోదసి యాత్ర ప్రారంభం కానుందని పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో దీన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. వాతావరణం, సాంకేతిక కారణాలు కారణంగా ఆరుసార్లు ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఆక్సియం-4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఎగరనుంది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం 14 రోజుల పాటు అక్కడే ఉంటారు.
పదోతరగతిలో ప్రేమ.. మందలించిన తల్లి.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక
హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాలిక, ఆమె ప్రియుడు, అతని తమ్ముడు కలిసి మాతృహత్యకు పాల్పడిన ఈ ఘటన వెనక ప్రేమ, కోపం, హింసల మేళవింపుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం ఎనిమిది నెలల క్రితం ఓ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వయసులో పదో తరగతి చదువుతున్న ఈ బాలిక అప్పటికే తన వయస్సును మరిచిపోయి ప్రేమలో మునిగిపోయింది. విషయం తెలిసిన తల్లి అంజలి “ఇంకా నీకు చదువు పూర్తవలేదు… ప్రేమ అవసరమా?” అంటూ మందలించిందట. దీంతో.. కొంతకాలంగా వారిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ, ప్లాన్‌లు వేసుకుంటూ, నమ్మకంగా పెరుగుతున్న సంబంధాన్ని ఎలాగైనా కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు.
ఇరాన్ కీలక ప్రకటన.. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ జరిగినట్లు ప్రకటన
ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగిసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ జరిగినట్లుగా తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా అంగీకరించింది. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా సోషల్ మీడియాలో తెలిపారు. 24 గంటల్లో దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మొదట ట్రంప్ ప్రకటనతో ఇరాన్ అంగీకరించలేదు. అలాంటిది ఏమీ లేదని పేర్కొంది. ఇంతలోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగించింది. ముగ్గురు చనిపోయారు. భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి అనంతరం తాజాగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లుగా ఇరాన్ ప్రకటించింది.
సిట్ ముందుకు ఈటల రాజేందర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు తాజాగా కీలక వ్యక్తులను విచారిస్తున్నారు. సోమవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను సాక్షిగా విచారించనుండగా, మరికాసేట్లో ఆయన సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఇక ఇదే కేసులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిల్ల సుధీర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సిట్‌కు తమ వాంగ్మూలాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు… “ట్యాపింగ్ లిస్టులో ఉన్న నంబర్ మీరు వాడుతున్నదేనా? ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ అనుమానం కలిగిందా?” అని సిట్ అధికారులు తమను ప్రశ్నించినట్లు వెల్లడించారు.
కేబినెట్ సమావేశం నుంచి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్.. కారణం ఏంటంటే?
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ ప్రారంభం అయింది. అయితే కేబినెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారంతో పవన్ వేంటనే కేబినెట్ నుంచి బయల్దేరారు. సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అంజనా దేవి అస్వస్థతతో మెగా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. గతంలో కూడా అంజనా దేవి పలుమార్లు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయి.. కొన్నిరోజులకు కోలుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని మెగా హీరోల ఫాన్స్ కోరుకుంటున్నారు.
బోనాలకు జాతరకు భారీ ఏర్పాట్లు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రివర్గం ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. జూలై 26నుంచి ప్రారంభం కానున్న బోనాల పండుగను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాలతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగను అన్ని రాజకీయాలకు అతీతంగా, అన్ని శాఖల సమన్వయంతో గొప్పగా నిర్వహించాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అశాంతి లేకుండా పండుగ జరగాలని కృషి చేయాలి అని అధికారులను ఆదేశించారు. పండుగ సమయంలో విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన మంత్రి.. ఎలక్ట్రిసిటీ వ్యవహారాన్ని ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షించాలి. తోపులాటలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. లష్కర్ బోనాలు హైదరాబాద్‌కి గర్వకారణమని, మన హైదరాబాద్ వాసులు అతిథులకు ఆతిథ్యం చెప్పడంలో ప్రసిద్ధులు అన్నారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాల్సిన బాధ్యత మనదే అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.
చంద్రబాబును చర్చకు పిలవడం మన దురదృష్టకరం..
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోదావరి – కృష్ణ జలాల వినియోగానికి సంబంధించిన అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీటి వాటా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు నష్టం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి చురుగ్గా స్పందించాల్సిన అవసరం ఉన్నా, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై ఎలాంటి చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు.
