TGSRTC : చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షించింది. తాండూరు నుంచి తెల్లవారుజామున 4.40 గంటలకు బయలుదేరిన ప్రైవేట్ హైర్ ఎక్స్ప్రెస్ బస్సు (TS 34TA 6354), చేవెళ్ల సమీపంలోని ఇందిరా రెడ్డి నగర్ వద్ద ఎదురుగా వచ్చిన కంకర లోడ్ టిప్పర్ (TG06T 3879) ను ఢీకొట్టింది. టిప్పర్ అతి వేగంతో బస్సు ముందు భాగాన్ని బలంగా ఢీ కొట్టడంతో, బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఢీ కొట్టిన టిప్పర్ బస్సుపై ఒరిగి పడటంతో, బస్సులోని పలువురు ప్రయాణికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ దస్తగిరి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు.
గాయపడిన వారిని వెంటనే చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రి, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పందించి, సమీపంలోని డిపో మేనేజర్లను సంఘటన స్థలానికి పంపింది. తాండూరు, వికారాబాద్, పరిగి డిపో మేనేజర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి, హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రో షా ఖాన్, రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత తదితర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన 25 మందికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
మృతులలో 5 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, టీజీఎస్ఆర్టీసీ నుంచి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా, గాయపడిన వారికి రూ.2 లక్షల సాయం ప్రకటించారు.
ప్రాథమిక విచారణలో బస్సు లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కాదని తేలిందని అధికారులు తెలిపారు. బస్సు సాంకేతికంగా సక్రమ స్థితిలో ఉందని, డ్రైవర్ దస్తగిరికి ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని పేర్కొన్నారు. రోడ్డుమలుపు వద్ద అతి వేగంగా వచ్చిన టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Pakistan: మునీర్ కోసం రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ ప్రభుత్వం సన్నాహాలు..!