తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. సుమారు రెండు నుంచి మూడు డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాగల 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హితవు పలికింది. అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు వడదెబ్బల బారిన పడే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉపరితల ద్రోణి విదర్భ నుంచి ఇంటీరియల్ కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్రమట్టం నుంచి దాదాపు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.