Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం

  • మూడు రోజులు తేలికపాటి వర్షాలు
  • భారీ వర్ష హెచ్చరికలు లేవు
  • కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం
  • హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇదే పరిస్థితి
Rain Alert

Rain Alert

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 5, 2026 నాటి మీడియా వాతావరణ బులెటిన్‌లో వివరాలను వెల్లడించింది. వాయువ్య మధ్యప్రదేశ్ , దానికి ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు ఉదయం 08:30 గంటలకు సాధారణ అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

 

ఇది రాబోయే 24 గంటల్లో దాదాపు అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి శ్రీ గంగానగర్, నార్నౌల్, వాయువ్య మధ్యప్రదేశ్ అల్పపీడన కేంద్రం, సిధి, డాల్టన్‌గంజ్, బంకురా మీదుగా త్రిపుర వైపు సాగుతోంది.

 

మరోవైపు, దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ , తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరొక ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఈ రోజు, రేపు , ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేయలేదని వాతావరణ కేంద్ర సంచాలకులు స్పష్టం చేశారు.