Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

  • కేంద్ర మంత్రికి రఘునందన్ ఫిర్యాదు
  • రూ.200 కోట్ల స్కామ్ ఆరోపణలు
  • సబ్సిడీ నిధుల మళ్లింపుపై విమర్శలు
  • 40 వేల ఇళ్లలో గోల్‌మాల్?
  • పార్లమెంట్ రచ్చపై ప్రతిపక్షాలపై ఫైర్
Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 కోట్ల సోలార్ కుంభకోణానికి పాల్పడిందని బిజెపి ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, ప్రజలను వంచించడమని మండిపడ్డ ఆయన, ఉచిత విద్యుత్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.

సబ్సిడీ సొమ్ము మళ్లింపు.. ఒకే పథకంలో రూ.200 కోట్ల గోల్‌మాల్

‘హర్ ఘర్ బిజిలీ ముక్త్ యోజన’ పథకం కింద రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకునే 40 వేల ఇళ్లను గుర్తించి, వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు అమర్చేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని రఘునందన్ రావు వివరించారు. ఈ టెండర్లలో ఒక ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ అమర్చేందుకు ఒక కంపెనీకి రూ.1,36,000లకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని, అయితే ఆ కంపెనీ సబ్ కాంట్రాక్ట్‌ను కేవలం రూ.86,000లకే మరొకరికి ఇచ్చిందని బయటపెట్టారు.

దీనివల్ల ఒక్కో ఇంటిపై ఏకంగా రూ.50 వేలు మిగులుతోందని, ఈ రకంగా మొత్తం 40 వేల ఇళ్లకు కలిపి రూ.200 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 1 కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేల చొప్పున భారీగా సబ్సిడీ ఇస్తుంటే, మోదీ ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ స్కామ్‌పై నిజాయితీగా స్పందించి విచారణకు ఆదేశించాలని, లేని పక్షంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పార్లమెంట్ స్తంభనపై ప్రతిపక్షాలపై మండిపాటు

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోవడంపై ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ, సభను నడపడంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా సమాన బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. ఢిల్లీ విద్యార్థుల ఆందోళనపై చర్చ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్పప్పటికీ, ప్రతిపక్షాల వద్ద సరైన సబ్జెక్ట్ లేకే రోజువారీ రచ్చ చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి కూడా దీనిపై సభలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్షాల గొడవ వల్ల ఇతర ఎంపీలు సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.