Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!

  • 2 వేల హోంగార్డుల నియామకంపై చర్చ
  • కొత్త పోలీస్ మాన్యువల్ విడుదలకు సన్నాహాలు
  • మహిళా పోలీసు అధికారుల సదస్సు
  • క్రీడలు, శిక్షణకు ప్రత్యేక క్యాలెండర్
Home Guards Recruitment

Home Guards Recruitment

Home Guards Recruitment : తెలంగాణ పోలీస్ శాఖ భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, సిబ్బంది సంక్షేమం, క్రీడా, శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వచ్చే నెలలో పోలీస్ రిట్రీట్ నిర్వహించడంపై సమీక్ష జరపగా, మహిళా పోలీసు అధికారుల సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే కొత్త తెలంగాణ పోలీస్ మాన్యువల్ విడుదలపైనా కీలకంగా సమాలోచనలు చేశారు.

హోంగార్డుల భర్తీ.. సిబ్బంది సంక్షేమంపై దృష్టి

రాష్ట్రంలో 2 వేల మంది హోంగార్డుల నియామకంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. హోంగార్డుల నియామక నోటిఫికేషన్‌కు సంబంధించిన అంశాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు. పోలీస్ శాఖలో మంజూరైన సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని సమీక్షించారు. మరోవైపు రిటైర్డ్ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంపై కూడా చర్చించారు.

బ్యాండ్ల పునరుద్ధరణ.. క్రీడలు, శిక్షణ క్యాలెండర్

పోలీస్ శాఖకు సంబంధించిన బ్రాస్, పైప్ బ్యాండ్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు. రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణపై సమీక్షించడంతో పాటు, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు. సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు పోలీస్ శాఖకు వార్షిక శిక్షణ క్యాలెండర్ రూపొందించడంపైనా దృష్టి సారించారు.

అధికారులకు బాధ్యతలు.. గడువులు నిర్దేశం

సమావేశంలో చర్చించిన ప్రతి అంశం, ప్రతి కార్యక్రమానికి ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఆయా పనులకు నిర్దిష్ట గడువులు కేటాయించిన డీజీపీ సీవీ ఆనంద్.. నిర్ణీత సమయంలోగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.