మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందరికీ దూరమై 12 ఏళ్లు గడిచింది.. ఆయనను స్మరించుకుంటూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాళులర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు.. ఇక, వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌తో పని చేసిన వారికి, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు.. ఇప్పటికే సీపీఐ నేత నారాయణ లాంటి వారు నేను రాలేకపోతున్నానని ప్రకటిస్తే.. కేవీపీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి నేతలు ఆ సమావేశానికవ వెళ్తున్నట్టు వెల్లడించారు.
ఇక, గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమావేశంపై స్పందించారు.. విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం వ్యక్తిగత అంశమని వ్యాఖ్యానించిన ఆయన.. అది ఫ్యామిలీ ఫంక్షన్ అంటూ కామెంట్ చేశారు.. వాళ్లకు ఆత్మీయులుగా ఉన్న నాయకులను పిలిచారు అని సమాచారం ఉందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కాగా, విజయమ్మ కుమారుడు వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉండగా.. ఆమె కుమార్తె.. ఈ మధ్యే తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తమ బిడ్డకు మద్దతు ఇవ్వాలంటూ కొందరు నేతలు, గతంలో పనిచేసిన అధికారులను కోరిన విజయమ్మ.. ఇప్పుడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ షర్మిల కోసమే విజయమ్మ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే చర్చ కూడా నడుస్తోంది.