AI Training : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును సరికొత్త సాంకేతికత వైపు నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 205 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (TMREIS) చదువుతున్న సుమారు 80,000 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , డిజిటల్ సేఫ్టీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, మస్క్ నెక్స్ట్‌జెన్ (MASK NextGen) , డోక్సా కన్సల్టింగ్ (DCPL) సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన “ఏఐ రీడైనెస్ అండ్ డిజిటల్ సేఫ్టీ ప్రోగ్రామ్” (AI Readiness and Digital Safety Program) రాబోయే ఆగస్టు 15 నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రతి బిడ్డకూ నాణ్యమైన సాంకేతిక విద్యను అందించి, తెలంగాణను అంతర్జాతీయ ఐటీ హబ్‌గా మార్చాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతకు అనుగుణంగా ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అంతర్జాతీయ పోటీకి అండగా గ్లోబల్ పార్ట్‌నర్ ‘డోక్సా’
ఈ నూతన విద్యా విధానం ద్వారా గురుకుల విద్యార్థులకు చిన్నతనం నుంచే కృత్రిమ మేధస్సు (AI) పరిజ్ఞానం, కోడింగ్ ప్రాథమికాంశాలు , సైబర్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. తెలంగాణ యువత కేవలం స్థానికంగానే కాకుండా ప్రపంచస్థాయి పోటీని తట్టుకుని నిలబడేలా, వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ డోక్సా కన్సల్టింగ్ గ్లోబల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. ఈ అత్యాధునిక శిక్షణ మైనారిటీ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే కాకుండా, రాబోయే రోజుల్లో వారికి ఐటీ రంగంలో అద్భుతమైన ఉపాధి , ఉన్నత విద్యా అవకాశాలను కల్పించడంలో మైలురాయిగా నిలవనుంది.

