తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకాన్ని అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ లైసెన్సుల పంపిణీ తొలి అడుగు. గత ప్రభుత్వంలో ధరణి పేరిట జరిగిన తప్పిదాలను సరిదిద్దే క్రమంలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటివరకు 3,456 మందికి లైసెన్సులు మంజూరు చేశాం” అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో సర్వే వ్యవస్థను బలోపేతం చేయడానికి నిర్ణయించామని చెప్పారు. “దీనికి 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,000 మందికి శిక్షణ ఇచ్చాం. ఫీల్డ్ ట్రైనింగ్ పూర్తి చేసిన 3,456 మందిని ఎంపిక చేసి, వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సులు అందజేస్తున్నాం” అని మంత్రి వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో జీపీవో వ్యవస్థ, భూభారతి, సాదా బైనామాల విషయంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల సుమారు 9.80 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు. “మీరు ఈ లైసెన్సులు పొందినంత సంతోషంగా ప్రజలు కూడా మీ సేవలతో సంతృప్తి చెందేలా పని చేయాలి. ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచే విధంగా, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిజాయితీగా వ్యవహరించాలి” అని మంత్రి పొంగులేటి సర్వేయర్లను పిలుపునిచ్చారు.
