NTV Telugu Site icon

అంబులెన్స్ నిలిపివేత పై హైకోర్టులో విచారణ… ఎలా అడ్డుకుంటారు…?

ఏపీ తెలంగాణ బోర్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి.  లాక్‌డౌన్ కార‌ణంగా ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ ల‌ను తెలంగాణ బోర్డ‌ర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు.  దీంతో అత్య‌వ‌స‌ర చికిత్స అంద‌క రోగులు మృతిచెందుతున్నారు.  ఇలా బోర్డ‌ర్‌లో అంబులెన్స్ లను అడ్డుకోవ‌డంపై ఏపీ ప్ర‌భుత్వం మండిప‌డింది.  ఇక, తెలంగాణ బోర్డ‌ర్లో అంబులెన్స్ ల‌ను అడ్డుకోవ‌డంపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.  ఈ విచార‌ణ‌లో ఏపీ ప్ర‌భుత్వం ఇంప్లీడ్ దాఖ‌లు చేసింది.  ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పుప అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీరాం వాద‌న‌లు వినిపించారు.  ఏపీ ప్ర‌భుత్వం అభ్యంత‌రాల‌పై హైకోర్టు సానుకూల‌త‌ను వ్య‌క్తం చేసింది.  తెలంగాణ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలపై హైకోర్టు అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.  తెలంగాణ ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త ఎక్క‌డ ఉంద‌ని అన్నారు.  రాజ్యాంగం కంటే మార్గ‌ద‌ర్శ‌కాలు గోప్పి కాద‌ని, రైట్ టు లైఫ్ ను ఆప‌డానికి మీకు ఏం అధికారం ఉంది అని ప్ర‌శ్నించింది హైకోర్టు.  ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధ‌న‌లు తాము చూడ‌లేద‌ని హైకోర్టు పేర్కోన్న‌ది.  రాజ్యాంగాన్ని మీరు మార్చ‌లేరని, నేష‌న‌ల్ హైవే యాక్ట్ ను ఉల్లంఘించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి అనుమ‌తి లేద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఈ విధంగా అంబులెన్స్ ల‌ను ఆప‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమైనా అనుమ‌తి తీసుకున్నారా అని ప్రశ్నించింది.