Site icon NTV Telugu

Telangana: బోయిగూడ అగ్నిప్రమాదంపై సర్కార్‌ సీరియస్.. కీలక ఆదేశాలు

సికింద్రాబాద్‌ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీరియస్‌ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. అగ్నిమాపక శాఖ, హైదరాబాద్ పోలీస్, జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్ అధికారులతో సమావేశానికి సిద్ధం అయ్యారు హోమంత్రి మహమూద్‌ అలీ.. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు హోం మంత్రి.. ఈ సమావేశంలో బోయిగూడ స్క్రాప్‌ గోదాంలో జరిగిన ప్రమాదంపై విశ్లేషించనున్నారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయి, వాటి అనుమతులపై కూడా రివ్యూ చేయనున్నారు.. మరోవైపు.. తరుచూ గోదాంలపై దాడులు చేయాలని అగ్నిమాపక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి మహమూద్‌ అలీ..

Read Also: Vizag Steel Plant: లోక్‌సభలో ఉక్కుశాఖ మంత్రి కీలక ప్రకటన

కాగా, బోయిగూడలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.. ఈ సమయంలో గోదాంలో ఉన్న 12 మందిలో ఒకరు తప్పించుకోగా.. 11 మంది బీహార్‌ కార్మికులు సజీవదహనం అయ్యారు.. గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి.. వారి బంధువుల సహాయంతో గుర్తించారు వైద్యులు.. మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మృతదేహాలను వారి స్వస్థలాలకు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈరోజు 6 మృతదేహాలు, రేపు మరో 5 మృతదేహాల తరలించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.. ఆరు గంటలకు బెంగళూరుకు ఆరు మృతదేహాలను తరలించనుండగా.. ఈరోజు వెళ్లిన మృతదేహాలు బెంగళూరులో భద్రపరుస్తారు.. ఇక, రేపు 5 మృతదేహాలను తరలించనున్నారు.. మొత్తం 11 మృతదేహాలను రేపు స్వస్థలాలకు పంపించనున్నారు. ఇక, అగ్నిప్రమాదం జరిగిన స్క్రాప్ గోదాం కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు అధికారులు.. ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ప్రమాదకరంగా మారింది రేకుల షెడ్డు.. దీంతో షెడ్డు కూల్చివేసేందుకు చర్యలు చేపట్టారు.. ఆరు జేసీబీలతో గోదాంను కూల్చివేయనున్నారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌.. ఇతర పార్టీ నేతలు, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. ప్రధాని మోడీ రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి విదితమే.

Exit mobile version