కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేలు పరిహారం ఇస్తోంది. గత ఏడాది నవంబరులో తొలి విడతలో 3,870 దరఖాస్తులు రాగా డిసెంబరులో వాటిని ఆమోదించి ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఇంకా బాధిత కుటుంబాలు ఉంటే పరిహారం అందుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. బాధిత కుటుంబాలు పరిహారం కోసం మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విప్తతు నిర్వహణ శాఖ సూచించింది.
Read Also: తెలంగాణ బీజేపీ ఎంపీపై అట్రాసిటీ కేసు
దరఖాస్తు సమయంలో బాధిత కుటుంబాలకు చెందిన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను అందజేయాల్సి ఉంటుందని తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ సూచనలు జారీ చేసింది. చనిపోయినట్లు ధ్రువీకరించే డెత్ సర్టిఫికెట్, మరణానికి కోవిడ్ కారణమని తెలిపే డాక్యుమెంట్ లేదా కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ పరీక్షకు సంబంధించిన పత్రం, ఆధార్ కార్డు వివరాలు దరఖాస్తు సమయంలో సమర్పించాలని కోరింది. ఆయా దరఖాస్తులను జిల్లా స్థాయిలో నియమించిన కమిటీ పరిశీలిస్తుందని… వారు నిర్ధారించిన తర్వాత పరిహారం మంజూరు అవుతుందని వివరించింది. వివరాలకు 040-48560012 నంబరులో కాల్ చేయవచ్చని పేర్కొంది.
