Site icon NTV Telugu

Telangana: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.వెయ్యి కడితే భూమి క్రమబద్దీకరణ

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవో 58, 59 నిబంధనలనే కొనసాగించింది. ఆక్రమిత భూములకు సంబంధించి జీవో 59 కింద రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. గతంలో ఉన్న ఆస్తి విలువలో 12.5% చెల్లించే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. మార్చి 31వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఒకవేళ దరఖాస్తును తిరస్కరించినా రూ.వెయ్యి డబ్బును వెనక్కి ఇవ్వరు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. అంతకు మించి ఉంటే రిజిస్ట్రేషన్‌ ధరలకు అనుగుణంగా చార్జీలు వసూలు చేస్తారు. భూమి క్రమబద్ధీకరణకు ఆధార్‌ కార్డు, ఆక్రమిత స్థలంలో 2014 జూన్‌ 2కు ముందు నుంచే ఉంటున్నట్టుగా ధ్రువీకరణ పత్రం. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ లేదా ప్రాపర్టీ ట్యాక్స్‌ రిసీప్ట్‌, విద్యుత్తు బిల్లు, వాటర్‌ బిల్లు రిసిప్ట్‌, లేదా నివాసాన్ని ధ్రువీకరించే ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Exit mobile version