Site icon NTV Telugu

Telangana: ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఆశావర్కర్లకు మొబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆశా వర్కర్లలకు రూ.4వేలు వేతనముంటే.. అదే తెలంగాణలో మాత్రం రూ.9,750 వేతనం ఇస్తున్నామని గుర్తుచేశారు. ప్రతి నెలా మొదటి వారంలోనే ఆశావర్కర్లలకు వేతనం అందిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు.

ఆశా కార్యకర్తల పనితీరును ప్రభుత్వం గుర్తించడం వల్లే వారికి స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డులను పంపిణీ చేస్తోందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కరోనా కాలంలో ఆశా కార్యకర్తలు బాగా పనిచేశారని కొనియాడారు. ఆశా కార్యకర్తలు ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి కాయకాల్ప అవార్డు రావడం సంతోషకరమన్నారు. కష్టపడితే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని… పని చేయకుంటే కఠినంగా ఉంటామని హరీష్‌రావు సున్నితంగా హెచ్చరించారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, డాక్టర్లు బాగా పని చేస్తే శాశ్వత నియామకాల్లో వేయిటేజీ కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు.

ఆశా కార్యకర్తలు జీతం కోసం గతంలో పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని.. సీఎం కేసీఆర్ మాత్రం ఆశా కార్యకర్తల మనసు తెల్సుకుని జీతాలను రూ.9750కి పెంచారన్నారు. ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 3లో ఉందన్నారు. మోదీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందని హరీష్‌రావు తెలిపారు. త్వరలోనే తెలంగాణ మొదటి స్థానంలోకి వెళ్లేందుకు అందరం కృషి చేద్దామన్నారు. జుక్కల్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ విధులు నిర్వర్తిస్తూ మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఏఎన్ఎం చనిపోతే కుటుంబానికి 50 లక్షల చెక్కు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Exit mobile version