Site icon NTV Telugu

Telangana Government: నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు భారీ నజరానా

Reward

Reward

అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్, ISSF షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ఇషా సింగ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నగదు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపింది.

కాగా ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో నిఖత్‌ జరిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్‌ జిటిపాంగ్‌ను 0-5తో చిత్తు చేసి బంగారు పతకం అందుకున్నది. దీంతో మేరీకోమ్‌, సరితాదేవి, జెన్నీ, లేఖ తర్వాత ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా జరీన్‌ నిలిచింది. అటు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్ ప్రపంచకప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

KTR: ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించాం

మరోవైపు గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.కోటి నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Exit mobile version