Telangana Governament: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో నౌకరీలు అందుబాటులోకి రానున్నాయి. ‘హైర్ మీ’ అనే బెంగళూరుకు చెందిన ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లక్షన్నర మంది విద్యార్థుల స్కిల్స్‌ని అంచనా వేసి వాళ్లకు నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై ట్రైనింగ్ ఇవ్వనుంది.
తద్వారా నిరుద్యోగులను, ఫ్రెషర్స్‌ను కొలువులకు సంసిద్ధం చేస్తుంది. ఈ మేరకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)తో కలిసి పనిచేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేసే క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ ఆప్టిట్యూడ్ అసెస్‌మెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలపై ఒక అవగాహనకు వస్తుంది. 716 కాలేజీల నుంచి టాస్క్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకున్న లక్షన్నర మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్‌ను ఉచితంగా రాయొచ్చు.
పరీక్ష పేరు ‘హైర్ మీ లింక్ డయగ్నాస్టిక్ అనాలసిస్ టెస్ట్’. టాస్క్ భాగస్వామిగా తాము స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ సొల్యూషన్స్ అందిస్తామని ‘హైర్ మీ’ ఫౌండర్ చోకో వల్లియప్ప తెలిపారు. ఎగ్జామ్‌లో భాగంగా విద్యార్థుల్లోని వివిధ నైపుణ్యాలను, టెక్నికల్ సబ్జెక్ట్ సామర్థ్యాలను వెలికితీస్తారు. ఎవరెవరికి ఏయే స్కిల్స్ పైన శిక్షణ ఇవ్వాలో నిర్ణయిస్తారు. ఈ మేరకు స్టూడెంట్లు మూడు వీడియోలను పంపాలి. ‘స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్’గా పేర్కొనే ఈ ఒక్కొక్క వీడియో నిడివి 20 సెకన్లు ఉండాలి.
‘అబౌట్ మీ'(నా గురించి), ‘మై స్కిల్స్'(నా నైపుణ్యాలు), ‘ఏరియా ఆఫ్ ఇంట్రస్ట్'(ఇష్టమైన అంశం) అనే పేర్లతో వీటిని కమ్యూనికేషన్ సెక్షన్‌లో అప్‌లోడ్ చేయాలి. వీటి ఆధారంగా విద్యార్థుల నైపుణ్యాలను తెలుసుకొని అసెస్‌మెంట్ రిపోర్ట్‌లను ఉద్యోగ కల్పన సంస్థలకు అందుబాటులో ఉంచుతారు. ఆ రిజిస్టర్డ్ సంస్థలు ‘హైర్ మీ’ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించుకొని అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు.
తమ కంపెనీ నిర్వహించే తదుపరి నియామక ప్రక్రియకు ఫార్వర్డ్ చేయొచ్చు. ఇదిలాఉండగా.. ‘హైర్ మీ’ సంస్థ దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా క్యాంపస్‌లకు చెందిన 20 లక్షల మంది స్టూడెంట్స్‌కు ఈ అసెస్‌మెంట్ ప్రక్రియను, ఏఐ ఆధారిత పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డులతో, యూనివర్సిటీలతో, కాలేజీలతో టైఅప్ అయింది.