Snapchat plus: అమెరికన్ కెమెరా అండ్ సోషల్ మీడియా కంపెనీ స్నాప్ అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఆ సంస్థ ప్రారంభించిన ప్రీమియం సర్వీస్ స్నాప్‌చాట్ ప్లస్‌కి యూజర్ల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఆరు వారాల కిందట మాత్రమే ఆరంభమైన ఈ ప్లాట్‌ఫామ్‌ను అతి తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
పేయింగ్ కస్టమర్ల సంఖ్య పది లక్షల మార్క్ దాటడంపై స్నాప్ కంపెనీ ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. యూజర్లు ఇకపై సెలెబ్రిటీల నోటీస్‌లు సైతం పొందుతారని తెలిపింది. స్నాప్‌చాట్ ప్లస్ ప్రీమియం నెలకి 3.99 డాలర్లు.
ఇండియా తొలిసారిగా
దేశీయ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో బొగ్గుకు బదులుగా వాడేందుకు మన దేశం వెనెజులా నుంచి పెట్రోలియం కోక్‌ను కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు భారీగా దిగుమతులు చేసుకుంటోంది. మన సంస్థలు ఆ దేశం నుంచి పెట్రో ఉత్పత్తులను కొనుగోలు చేయటం ఇదే తొలిసారి. ఈ మేరకు వాణిజ్య వర్గాలు, షిప్పింగ్ డేటా వెల్లడిస్తోంది. అమెరికా ఆర్థిక ఆంక్షల ప్రభావం టార్గెటెడ్‌గా లేకపోవటంతో ఒపెక్ దేశమైన వెనెజులా ఎగుమతులను పెంచుతోంది.
ఇ-స్కూటర్ రీలాంఛ్
ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రీలాంఛ్ అయింది. పరిచయ ధర 99,999 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఆఫర్ పరిమిత కాలమే అని పేర్కొంది. ప్రస్తుతానికి ప్రి-ఆర్డర్లకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. రిజర్వ్ చేసుకునేందుకు రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛాన్స్ ఈ నెల 15-31 మధ్యలోనే అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 1న ఎర్లీ యాక్సెస్ విండో, 2వ తేదీన పర్ఛేజ్ విండో ఓపెన్ అవుతాయి. సెప్టెంబర్ 7 నుంచి డెలివరీ మొదలుపెడతారు. ఇదిలాఉండగా ఓలా ఎలక్ట్రిక్ కార్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజుల విరామం అనంతరం స్టాక్ మార్కెట్లు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. పునఃప్రారంభం భారీ లాభాలతో శుభారంభం కావటం గమనార్హం. సెన్సెక్స్ ప్రస్తుతం 245 పాయింట్లు పెరిగి 59708 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 17774 పైనే కొనసాగుతోంది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్స్ 20 శాతం లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆటోమొబైల్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అపోలో, టాటా స్టీల్, ఓఎన్జీసీ స్టాక్స్ ఊగిసలాటలో కనిపిస్తున్నాయి.