CM Revanth Reddy :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉద్యోగులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వివిధ ప్రముఖ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు (MOU) కుదుర్చుకుంది. ఈ పథకం కింద ఉద్యోగులు, కార్మికులకు గరిష్టంగా రూ. కోటి వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సింగరేణి సంస్థకు చెందిన 45 మంది కార్మికులకు ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేశామని సీఎం వెల్లడించారు.
నేను ‘గుంపు మేస్త్రి’నే.. రేవంతన్న అని పిలిస్తేనే ఆనందం
వివిధ రాజకీయ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. “ఈ జనమంతా నాదే.. నేను గుంపు మేస్త్రినే. కొంతమంది దొరలమని గొప్పలు చెప్పుకుంటారు, కానీ నేను అలా చెప్పుకోను. రేవంతన్న అని పిలిపించుకోవడమే నాకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తాను జెడ్‌పీటీసీగా, ఆ తర్వాత ఎంపీగా పనిచేశానని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని గుర్తు చేస్తూ.. కాలక్రమేణా పదవులు మారుతుంటాయని, కానీ ‘రేవంతన్న’ అనే పిలుపు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుందని భావోద్వేగంగా అన్నారు.
రోజుకు ఒక గంట అదనంగా పనిచేయాలి
రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు నడుం బిగించాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్యోగులంతా రోజుకు ఒక గంట అదనంగా పని చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కొందరు పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి పట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ట్యాక్స్ బకాయిలను కఠినంగా వసూలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
వడ్డీ భారం తగ్గింపు.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు: సీఎం ధ్వజం
గత ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకులు అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, గతంలో 11 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 7.5 శాతానికి తగ్గించగలిగామని వివరించారు.
రాష్ట్రంలో తాము చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని సీఎం మండిపడ్డారు. “మూసీ నది పునరుజ్జీవనం చేద్దామంటే నా కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు (RRR) చేపడితే తప్పా? మెట్రో విస్తరణ చేద్దామన్నా, ఆర్‌ఆర్‌ఆర్ తెస్తామన్నా వద్దే వద్దని అడ్డుపడుతున్నారు. తమకు ఓట్లు వేయని ప్రజలు ఉంటే ఏంది, పోతే ఏంది అనే రీతిలో బీఆర్‌ఎస్ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు” అని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

