El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ

  • ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
  • భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
  • తాగునీరు, సాగునీరు, విద్యుత్‌పై కీలక చర్చ
  • రైతుల కోసం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక
Elnino

Elnino

రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, వర్షపాతంలో లోటు , ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్రంలో ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చించేందుకు సచివాలయంలో అత్యంత కీలకమైన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలు, రైతులపై ఎల్‌నినో ప్రభావం పడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.

ఈ ఉన్నత స్థాయి అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వ వైపు నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎల్ నినో నోడల్ ఆఫీసర్ రామకృష్ణారావు హాజరయ్యారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రముఖ నేతలు ఈ భేటీలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ తరఫున అంజన్ కుమార్ యాదవ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి హాజరుకాగా.. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, ఎల్ రమణ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ ప్రతిపక్ష నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ప్రొఫెసర్ సింహాద్రి, వెంకటేశ్వర్లు, ఆర్‌జేడీ నాయకురాలు శోభ యాదవ్, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు శ్రీరామ్ కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు హేమ సుదర్శన్ తదితర అఖిలపక్ష నేతలు హాజరై విలువైన సలహాలు అందించారు.

రాష్ట్రంలో వర్షాలు తగ్గడం, కరువు పరిస్థితులు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పలు కీలక అంశాలపై అఖిలపక్ష నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ముఖ్యంగా వేసవి , కరువు కాలంలో తాగునీటి సరఫరాను నిరంతరం కొనసాగించడం, రాష్ట్రంలోని నీటి వనరులను సంరక్షించడం, వ్యవసాయ రంగానికి ఎలాంటి అంతరాయం లేకుండా సాగునీటికి విద్యుత్ సరఫరా చేయడం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అందించడం వంటి అంశాలపై చర్చ జరిపారు. కరువు నివారణకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే దానిపై క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రుల బృందం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. అందరి సహకారంతో రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తోంది.