Telangana El Nino : ఎల్‌నినో ముప్పు.. రంగంలోకి కేబినెట్ సబ్ కమిటీ.!

  • ఎల్‌నినో ప్రభావంపై సమీక్షకు ప్రత్యేక కమిటీ
  • భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ
  • గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై ఫోకస్
  • జల సంరక్షణకు ఇంకుడు గుంతలు, ఊట కుంటలు
Elnino

Elnino

రాష్ట్రంలో ముంచుకొస్తున్న ఎల్‌నినో పరిస్థితులు, తీవ్ర కరువు ఛాయలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విపత్కర వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయడంతో పాటు తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఒక ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 1523ను జారీ చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సబ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క)తో పాటు మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా నియమితులయ్యారు.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర సమీక్షలు

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేసవికి ముందే నీటి ఎద్దడి సమస్యలను గుర్తించి పరిష్కరించడం, అందుబాటులో ఉన్న జల వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, గ్రామీణ ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీరు అందేలా చూడటంలో ఈ శాఖ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది.

జల సంరక్షణకు పెద్దపీట.. ఇంకుడు గుంతలు, ఊట కుంటల నిర్మాణం

తాగునీటి భద్రతతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం జల సంరక్షణకు పంచాయతీరాజ్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంపొందించే దిశగా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పంట గుంతలు, ఊట కుంటల నిర్మాణం మరియు వాటి నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నీటి వనరులను సంరక్షించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే నీటి కొరతను సమర్థవంతంగా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకత్వంలో అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతూ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధమవుతున్నాయి.