Congress Third List: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 19 స్థానాలు ప్రకటించే అంశంపై నేతలు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈరోజు జాబితాను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే రెండు, మూడు నియోజకవర్గాలు పెండింగ్‌లో ఉండొచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడిపోతారనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. బీఆర్‌ఎస్ ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి బహిరంగ సభలు నిర్వహించి ప్రచారంలో దూసుకుపోవడంతో మరింత వెనుకబడే అవకాశం ఉందని హస్తం ఆశావహులు భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు ఏర్పడింది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ పార్టీ అభ్యర్థి పోటీ చేయనున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీపీఐకి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ అధిష్టానం స్నేహపూర్వక పోటీకి అంగీకరించలేదు. దీనికి సీపీఐ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించలేదని సమాచారం. సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి రావడంతో పొత్తుపై ఈరోజు అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పొత్తును ప్రకటించనున్నట్లు సమాచారం. కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రేవంత్ నేరుగా సీపీఐ కార్యాలయానికి రానున్నారని తెలుస్తోంది. మునుగోడులో స్నేహపూర్వక పోటీ ఉండదని కాంగ్రెస్ చెబుతున్న నేపథ్యంలో సీపీఐ ఇద్దరు ఎమ్మెల్సీలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరోవైపు ఈరోజు మునుగోడులో నల్గొండ జిల్లా సీపీఐ కార్యవర్గ సమావేశం జరగనుంది. మునుగోడులో పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు. కాగా.. సూర్యాపేట, తుంగతుర్తిలో పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ స్థానాలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అయితే వారితో పూర్తి స్థాయిలో చర్చలు జరిపి సాయంత్రానికి మూడో జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
CM Kejriwal: ఢిల్లీలో వాయు కాలుష్యం.. నేడు సీఎం కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమావేశం