Telangana Congress Party Planning A Huge Public Meeting On November 7: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. మెనూరులో పెద్దఎత్తున చారిత్రాత్మక బహిరంగ సభను నిర్వహించనున్నామని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి వికృమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్ 23న కర్ణాటక నుంచి తెలంగాణలోని మక్తల్‌లో భారత్ జోడో యాత్ర అడుగుపెట్టిందని.. 27వ తేదీ నుంచి ఈ యాత్ర వరుసగా సాగిందన్నారు. ఈ యాత్రకు తెలంగాణ ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించిందన్నారు.
ఈ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్దయెత్తున పాల్గొని.. రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించారన్నారు. అనేక సామాజిక కార్యకర్తలు, కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, మహిళ సాధికారిత కార్యకర్తలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, చిన్న పిల్లలు.. ఇలా అనేక వర్గాలవారు రాహుల్ గాంధీని కలిసి, తమ సమస్యలను వివరించారన్నారు. అందుకు రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించి, వారిని అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారన్నారు. నవంబర్ 7వ తేదీన ఈ యాత్ర తెలంగాణలో ముగిసి.. ఆ రోజు రాత్రి మహారాష్ట్రలో అడుగుపెడుతుందన్నారు. ఈ యాత్రను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇన్నిరోజులు ఎలాగైతే ఈ యాత్రకు మద్దతు తెలిపారో.. అలాగే 7వ తేదీన జరిగే చివరి సభకు కూడా ప్రజలు భారీగా తరలివచ్చి, రాహుల్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.