NTV Telugu Site icon

Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. కాంగ్రెస్ పెద్దలతో మూడు అంశాలపై చర్చ

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా మదు సమస్యలపై ఆయన నాయకత్వంతో చర్చిస్తారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, ఇటీవల వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లను తొలగించారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం సహా 12 మంది ఉండగా.. మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మిగిలిన 6 స్థానాల్లో డజనుకు పైగా సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.

Read also: Sabarimala: శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం

ఈ క్రమంలో ఈ ఆరు బెర్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీటిపై ఆసక్తిగా చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని సోమవారం గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి తర్వాత లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను కూడా నియమించారు. తెలంగాణ నుంచి అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పీఏసీలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, సోనియాగాంధీ పోటీ తదితర అంశాలపై సీఎం రేవంత్ అధిష్ఠానం చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం హోదాలో ఆయనను తొలిసారి మర్యాదపూర్వకంగా కలిసే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం రేవంత్ ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
PM Modi: ఓటమి నిరాశతో పార్లమెంట్‌కు అంతరాయం కలిగిస్తున్నారు: ప్రధాని మోడీ