NTV Telugu Site icon

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. క్లౌడ్ బరస్ట్‌ వెనుక విదేశాల కుట్ర.. అందుకే భారీ వర్షాలు

Kcr Badrachalam Visit

Kcr Badrachalam Visit

CM KCR Sensational Comments: భద్రాచలం పర్యటనలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని.. దీని వెనుక కుట్రలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గతంలో లేహ్‌లో ఇలా చేశారని.. ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని.. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు. అటు గోదావరికి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని.. ఈనెల 29 వరకు ప్రతిరోజూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని.. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.

Read Also: Corona Vaccination: ఇండియా రికార్డ్ .. వ్యాక్సిన్ కార్యక్రమంలో 200 కోట్ల డోసులు పూర్తి

అంతకుముందు భద్రాచలంలో గోదావరి బ్రిడ్జిపై సీఎం కేసీఆర్ శాంతిపూజలు నిర్వహించారు. అనంతరం కరకట్టను పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. త్వరలోనే భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో కంటే కనివినీ ఎరుగని వరదలు వస్తున్నాయని.. 50 అడుగులు గోదావరి వచ్చిన కొన్ని ప్రాంతాలు మునుగుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.