NTV Telugu Site icon

‘భూదాన్ పోచంప‌ల్లి’కి అంతర్జాతీయ గుర్తింపు.. కేసీఆర్‌ హర్షం

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని ‘భూదాన్ పోచంప‌ల్లి’కి ఉత్తమ ప్రపంచ ప‌ర్యాట‌క గ్రామంగా అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.. ఐక్యరాజ్య స‌మితి అనుబంధ ప్రపంచ ప‌ర్యాట‌క సంస్థ, భూదాన్ పోచంప‌ల్లిని ఉత్తమ ప్రపంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక చేయడం అభినందనీయమన్న కేసీఆర్.. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా, తెలంగాణ చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని తెలిపారు.

Read Also: శ్రీవారి భక్తులకు అలెర్ట్: 2 రోజుల పాటు నడకదారులు మూసివేత..

కాగా, తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది… ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి పోటీపడిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం ఆ ఘనత సాధించింది.. ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా పోచంపల్లిని ఎంపిక చేశారు.. ఇక, డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం ఉంటుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.