తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
క్యాబినెట్ నిర్ణయాలు :
■మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది.
■మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.
■యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
■ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను క్యాబినెట్ ఆదేశించింది.
■అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.
■రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరిన సీఎం.
■ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు.