Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సచివత్వంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ పరిధిలోని సిటిజన్స్ అర్బన్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఎకానమీ (CURE) ప్రాజెక్ట్ పరిధిలో నిర్మించతలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లకు భూకేటాయింపులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేద, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.
‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2..
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌ను గతేడాది కంటే మరింత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి ప్రత్యేకంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ అనే థీమ్‌తో ఈ సమ్మిట్‌ను ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, తెలంగాణలో ఇప్పటివరకు స్టార్టప్‌లు సాధించిన విజయాలు, సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా సమ్మిట్ ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.

