తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్‌లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావేశాలుగా పరిగణించనందున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వుండదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై అనవసరంగా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడింది.
బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం శాసనసభ, మండలి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సమావేశం కానున్నాయి. పదిరోజుల పాటు సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం ఈ మారు కాస్త సుదీర్ఘంగానే ఉండనుంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి. అనంతరం శాసనసభ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశం అవుతాయి. బీఏసీ భేటీల్లో బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విపక్షాలు ప్రభుత్వంపై దాడికి అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. ఈసారి సభలో బీజేపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు వుండనున్నారు. గతంలో రాజాసింగ్, రఘునందన్ రావు వుండగా హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలను ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అటు పాలకపక్షం సైతం విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ధాన్యం సేకరణ, సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాలు, ఆర్థికపరమైన అంశాలు, కేంద్రం నుంచి నిధులు, విభజన చట్టం హామీలు, ఉద్యోగ నియామకాలు, హామీల అమలు తదితర అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వస్తాయని భావిస్తున్నారు.
