Site icon NTV Telugu

BJP July 3: మోదీ సభకు భారీ ఏర్పాట్లు.. 50 లక్షల మందికి ఆహ్వాన పత్రికలు

Amithsha, Modi, Jp Nadda

Amithsha, Modi, Jp Nadda

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకుని జులై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది. ఈ సభకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. చరిత్రలో ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. సభకు 10 లక్షల మందికిపైగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభారీలతో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహక కమిటీ చైర్మన్ లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇన్‌చార్జ్ అరవింద్ మీనన్ సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలను ఇంటింటికి పంపి బహిరంగ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించి సభకు ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 50 లక్షల ఆహ్వాన పత్రికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేల మందికి తగ్గకుండా సభకు హాజరయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు. అలాగే, ప్రతి పోలింగ్ బూత్ నుంచి మండలం, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకుల వరకు విరాళాలు సేకరించాలని కూడా ఆదేశించారు. అయితే, నగదు పేమెంట్లు స్వీకరించవద్దని, పార్టీ రాష్ట్రశాఖ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకు డిజిటల్ పేమెంట్ల రూపంలో మాత్రమే తీసుకోవాలని సూచించారు.

Bihar: బిహార్‌లో పిడుగుపాటుకు 17 మంది బలి..

Exit mobile version