Site icon NTV Telugu

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతాం : బండి సంజయ్

తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం. ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోడి ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటూ పేదల కోసం పనిచేస్తోంది. తెలంగాణలో అందుకు భిన్నంగా అవినీతి, రాక్షస, కుటుంబం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి మల్లన్న. తన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ పోలీసు కేసులతో అనేక కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని తెలిపారు.

ఇక ఇప్పటికే మల్లన్నపై కేసీఆర్ అనేక నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి వేధించారు. అయినా వెరవని మల్లన్న తాను ఎంచుకున్న దారిలో వెళుతూ అమరవీరుల ఆశయం కోసం పోరాడుతున్నారు. మల్లన్నపై పదేపదే కావాలని కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. మల్లన్నను చూసి మేం బాధపడ్డాం. మలన్నకు అండగా నిలబడ్డాం. తెలంగాణలోని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారు. విఠల్, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదు. పోరాడే తెలంగాణ ఉద్యమకారులు, పోరాట పటిమ ఉన్న నేతలు. వారి లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీ ఉద్యమిస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతాం. కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడతాం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు వేదిక బీజేపీ. కాబట్టి బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నాను అని పేర్కొన్నారు.

Exit mobile version