Local Body Elections : తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతాయని వాదిస్తూ, వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆయన వాదన. ఈ పిటిషన్‌పై ఎల్లుండి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
UP Blast: ఉత్తరప్రదేశ్‌లో భారీ పేలుడు.. తీవ్ర భయాందోళనలు..
ఇక మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశంపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 8న విచారణకు తీసుకోనుంది. ఇప్పటికే హైకోర్టు, “కోర్టులో కేసు ఉన్న సమయంలో ఎన్నికల ప్రక్రియను ఎందుకు ముందుకు తీసుకువెళ్తున్నారు?” అని ప్రశ్నిస్తూ, ఎన్నికల ప్రకటనపై ప్రశ్నలు లేవనెత్తింది. అసెంబ్లీ తీర్మానం ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల కూడా కోర్టు ఆక్షేపణలు వ్యక్తం చేసింది.
అక్టోబర్ 8న హైకోర్టు విచారణ జరగనున్న సందర్భంలో, మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైలవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేక అడ్డుకట్ట పడుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నట్లు ప్రకటించింది. కానీ 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టు రెండింటిలోనూ ఉండటంతో, ఈ ఎన్నికల భవిష్యత్తు న్యాయస్థానాల నిర్ణయంపై ఆధారపడి ఉంది.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై వచ్చిన ఈ సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఏ దిశగా వెలువడతాయి అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Madannapet Case: మాదన్నపేట బాలిక హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు
