Site icon NTV Telugu

CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్ల అంశంపై రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. రంగంలో ఫేమస్ లాయర్

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా ప్రతి దశలోనూ బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగిస్తోంది.

ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ తరఫున ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింగ్వి, సిద్ధార్థ దవే లు హాజరై వాదనలు వినిపించారు. ఈ విచారణకు ముందే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశాలు ఇవ్వడంతో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి లతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా భట్టి విక్రమార్క, మంత్రుల బృందం స్వయంగా సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది.

Meesala Pilla: ప్రోమోకే ఇలా అయిపోతే ఎలా.. అసలు మ్యాటర్ అబీ బాకీ హై!

మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వి తో ఫోన్ లో మాట్లాడారు. రేపు (బుధవారం) హైకోర్టులో జరగనున్న బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని ఆయన కోరారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఢిల్లీలో సింగ్విని కలసి అదే విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సున్నితమైనదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించాలని వారు కోరారు.

హైకోర్టులో రేపు జరగనున్న విచారణకు ముందు, కేసు పురోగతిపై సమగ్ర సమీక్ష జరపాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొననున్నారు.

బీసీ రిజర్వేషన్ల అంశం సామాజిక సమతుల్యతకు సంబంధించిన కీలకమైన అంశమని ప్రభుత్వం భావిస్తోంది. కేసు పురోగతిని గంట గంటకు పర్యవేక్షిస్తూ, న్యాయపరంగా ఏ మార్పులు వచ్చినా తక్షణమే వ్యూహాన్ని సవరించుకునేలా ప్రత్యేక టీమ్‌ను సీఎం రేవంత్ ఏర్పాటు చేశారు. న్యాయ పోరాటంతో పాటు రాజకీయ, సామాజిక వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.

2025 Nobel Prize Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి..

Exit mobile version