CM Revanth Reddy : తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, విజయవంతంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వేను ‘రేర్ మోడల్’ గా పేర్కొనవచ్చని, దీనిపై సోనియాగాంధీ తనకు అభినందనలు తెలుపుతూ లేఖ రాయడం తన జీవితంలో ఒక గొప్ప అచీవ్‌మెంట్ గా భావిస్తున్నానని అన్నారు.
“సోనియా గాంధీ రాసిన లేఖ నాకు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు లాంటిది. అది నోబెల్, ఆస్కార్ అవార్డు లాంటిది,” అని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా అన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన రాష్ట్రంలో, రాహుల్ గాంధీ చెప్పిన హామీని అమలు చేసి చూపించామని, “రాహుల్ మనసులో ఉన్నది చేసి చూపించాను” అని ఆయన ప్రకటించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ వివరాలను సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని సీఎం వివరించారు.
HHVM Song: హరిహర వీరమల్లు పవర్‌ఫుల్ పాట లిరికల్ వచ్చేసిందోచ్…
తెలంగాణలో చేసిన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించామని రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అయితే, “మూడు నెలలుగా రాష్ట్రపతి ఆమోదం చేయలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున ఖర్గేలకు విజ్ఞప్తి చేస్తూ, పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదం కోసం పోరాడాలని కోరారు. అవసరమైతే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తామని కూడా తెలిపారు.
“నేను ముందు నుంచి కాంగ్రెస్ లో లేను, నీకు సీఎం కుర్చీ దొరికిందని కొందరు మిత్రులు అంటుంటారు. కానీ నేను కాంగ్రెస్ లోకి తరువాత వచ్చినా రాహుల్ గాంధీ ఆత్మతో కలిసిపోయాను, మమేకం అయ్యాను. రాహుల్ గాంధీ గుండె ఏమి కోరుకుంటుంది అదే నేను చేశాను” అని రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం, కులగణన ఘనత రాహుల్ గాంధీదేనని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కోరిక మేరకే దీన్ని చేసి చూపించామని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినంగా అభివర్ణించారు. కాంగ్రెస్ తోనే ఏదైనా సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. “మోడీ పుట్టుకతో బీసీ కాదు. ముఖ్యమంత్రి అయ్యాక బీసీగా కన్వర్ట్ అయ్యారు” అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కులగణన నినాదంతోనే మోడీ ప్రభుత్వం కులగణన లెక్కలకు ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.