El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ

  • ఎల్‌నినో, వర్షపాతం లోటుపై చర్చ
  • భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
  • తాగునీరు, సాగునీటి సరఫరాపై ప్రధానంగా చర్చ
  • కరువు నివారణకు పార్టీల సూచనలు స్వీకరించనున్న ప్రభుత్వం
Elnino

Elnino

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు , తీవ్రమవుతున్న కరువు పరిస్థితులపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించేందుకు బుధవారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో (6వ అంతస్తు, గది నంబర్ 33) ఈ సమావేశం జరగనుంది.

ప్రధానంగా చర్చకు రానున్న కీలక అంశాలు

రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల అన్నదాతలు, సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించే దిశగా ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించడం, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, అలాగే వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించనున్నారు.

అఖిలపక్ష నేతల సలహాలు, సూచనలతో సమగ్ర వ్యూహం

కరువు నివారణకు అనుసరించాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలపై వివిధ రాజకీయ పార్టీల నేతల నుంచి విలువైన సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించనుంది. రాష్ట్రంలో తలెత్తిన ఈ కరువు పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేయనుంది. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ అఖిలపక్ష భేటీ దిశనిర్దేశం చేయనుంది.