Task Force Police Arrested 4 Members In Ruby Hotel Fire Accident: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్‌లో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే! ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజమాని రాజేందర్ సింగ్ బగ్గా, ఆయన కుమారుడు సునీత్ సింగ్ బగ్గా, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్‌ను అరెస్ట్ చేశారు. హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకోవడానికి ముందు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో.. రూబీ ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్‌ని తండ్రికొడుకులు రాజేందర్ సింగ్, సునీత్ సింగ్ మూసివేసి.. కార్ఖానాలోని తమ ఇంటికి వెళ్లిపోయారు. 9:45 గంటల సమయంలో హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభించిందని.. హోటల్‌లో పని చేసే సిబ్బంది రాజేందర్ సింగ్‌కు సమాచారం అందించారు.
అప్పుడు రాజేందర్ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ఫైర్ యాక్సిడెంట్‌లో 8 మంది చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన, అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ.. భవన యజమానితో పాటు రూబీ ఎలక్ట్రికల్ షోరూం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్పటికే హోటల్‌ను సీజ్ చేశారు. అయితే.. వాళ్లు పరారీలో ఉన్నారని తెలిసి, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వాళ్లు కిషన్ బాగ్‌లో తలదాచుకున్నారన్న విషయం పోలీసులకు తెలిసిందే! దీంతో వెంటనే అక్కడికి చేరుకొని.. తలదాచుకున్న రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు హోటల్ మేనేజర్, సూపర్ వైజర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. భవన నిర్మాణ లోపాలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణలో పొరపాట్లు, అంతకుమించిన నిర్లక్ష్యమే ఈ అగ్ని ప్రమాదంలో 8 మంది ఆహుతి అయినట్లు తేలింది. ఫోమ్ సిలిండర్ ద్వారా ఆపేందుకు ప్రయత్నిస్తే, అది కొన్ని సెకన్లే పని చేసింది. ఆ తర్వాత ఆ పరికరం పని చేయలేదు. అసలు ఆ భవనానికి నిప్పును ఆర్పే వ్యవస్థే లేదని తెలిసింది. దీనికితోడు హోటల్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఒకటే. సెల్లార్‌ను కూడా పార్కింగ్ కోసం కాకుండా వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. జీ+3 అంతస్తులకి అనుమతి ఉంటే, అక్రమంగా మరో రెండు అంతస్తుల్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఈ హోటల్‌ని సీజ్ చేశారు.