NTV Telugu Site icon

Tarun Chugh: కేసీఆర్ మోసాన్ని బీజేపీ నగ్నంగా బయటపెడుతుంది.. తరుణ్ చుగ్ ప్రకటన

Tarun Chugh

Tarun Chugh

Tarun Chugh Demands Sitting Judge Investigation On TSPSC Paper Leak: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ పేపర్ లీకేజ్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జిని కూడా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పై నుంచి ఆదేశాలు లేనిదే ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ సాధ్యం కాదన్న ఆయన.. ఈ లీక్‌తో మోసపోయామని భావించిన వందలాది మంది యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడి చేయలేరన్నారు. మహిళలను సైతం విచక్షణారహితంగా కొట్టారన్నారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యారన్నారు.

Minister KTR: బండి సంజయ్ ఒక దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని.. కేటీఆర్ ఫైర్

సంజయ్‌ కుమార్‌ను అరెస్టు చేసో, ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడో.. ఈ స్కామ్ నుంచి బయటపడొచ్చని కేసీఆర్‌ భావిస్తే.. అది అవివేకమే అవుతుందని తరుణ్ చుగ్ విమర్శించారు. ఈ స్కామ్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించడానికి కేసీఆర్ ఎందుకు వెనుకాడుతున్నారు? ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు? ఎవరిని రక్షించేందుకు చూస్తున్నారు? ఎందుకు ఈ మొండివైఖరి? అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్ల.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువకుల భవిష్యత్తు ఆగమైందని, వారి ఆవేదన ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని అడిగారు. TSPSC స్కామ్‌కు పాల్పడిన అసలు దోషులను శిక్షించే వరకు.. ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు తెలంగాణ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను బీజేపీ తెలంగాణ శాఖ పునరుద్ఘాటిస్తోందని అన్నారు. యువత, TSPSC అభ్యర్థులు అధైర్యపడొద్దని సూచించారు. కెసిఆర్ మోసాన్ని బీజేపీ ప్రజల ముందు నగ్నంగా బయటపెడుతుందని.. అహంకారాన్ని ప్రదర్శిస్తున్న కేసీఆర్ కుటుంబం భారీ మూల్యం చెల్లించుకునే రోజు ఎంతో దూరం లేదని చెప్పారు.

Delhi Liquor Case: మనీష్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు..

Show comments